ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నష్టాల పేరుతో కృష్ణపట్నంపై ప్రై"వేటు"

కృష్ణపట్నం థర్మల్‌ ప్లాంట్‌ను ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. థర్మల్‌ యూనిట్ల నిర్వహణలో దేశంలోనే గుర్తింపు పొందిన జెన్‌కోను.. చేతగాని సంస్థగా ప్రభుత్వం తేల్చింది. నిర్వహణ లోపంతోనే కృష్ణపట్నం ప్లాంటు నష్టాల్లో ఉందని, ఈ భారాన్ని తగ్గించుకునేందుకు ప్రైవేటుకు అప్పగించాలని జెన్‌కోను ఆదేశించింది.

Krishnapatnam power plant
కృష్ణపట్నం థర్మల్​ ప్లాంట్​

By

Published : Oct 12, 2022, 7:44 AM IST

కృష్ణపట్నం థర్మల్‌ యూనిట్ల నిర్వహణను ప్రైవేటుకు అప్పగించడంపై ఉద్యోగ సంఘాల వ్యతిరేకతను ప్రభుత్వం ఏమాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదు. సన్నిహిత సంస్థకు యూనిట్ల నిర్వహణను కట్టబెట్టే ప్రయత్నం చేస్తోందన్న విమర్శలనూ పట్టించుకోవడం లేదు. ఒక్కొక్కటి 800 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మూడు యూనిట్లను ప్రైవేటుకు ఇవ్వాలని నిర్ణయించింది. దీనికోసం ప్రతిపాదన కోరే ప్రకటన ఆర్​ఎఫ్​పీ జారీ చేయాలని జెన్‌కోను ఆదేశించింది.

ఈ నెల 20న ఆర్​ఎఫ్​పీ ప్రకటన జారీ చేసి.. అదేరోజు నుంచి టెండరు పత్రాలను గుత్తేదార్లకు అందుబాటులో ఉంచనుంది. బిడ్‌ల దాఖలుకు 21 రోజుల గడువు ఇస్తామని, నవంబరు నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తిచేయాలనే ఆలోచనలో ఉన్నామని అధికారులు తెలిపారు. చర వ్యయంలో యూనిట్‌కు 40 నుంచి 50 పైసలు దిగొచ్చినా.. డిస్కంలపై కొంత ఆర్థికభారం తగ్గుతుందని చెబుతున్నారు. బిడ్డింగ్‌ విధివిధానాలను రూపొందించే బాధ్యతను ఎస్​బీఐ క్యాపిటల్స్‌కు జెన్‌కో అప్పగించింది.

ఒడిశాలోని మహానది కోల్‌ఫీల్డ్స్‌ నుంచి కృష్ణపట్నం థర్మల్‌ యూనిట్లకు బొగ్గు కేటాయింపులు ఉన్నాయి. అక్కడి నుంచి బొగ్గు తీసుకొచ్చి.. గుత్తేదారు సంస్థ ప్లాంటును నిర్వహించాలి. ఇప్పుడు ఏపీ జెన్‌కో అదే చేస్తోంది. అదనంగా బొగ్గు కావాలన్నా జెన్‌కో నుంచే గుత్తేదారు సంస్థ అనుమతి తీసుకోవాలి. అలాంటప్పుడు నిర్వహణను ప్రైవేటుకు అప్పగించడం వల్ల వచ్చే లాభమేంటని ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

కృష్ణపట్నం రెండు యూనిట్లతో గతంలో డిస్కంలు కుదుర్చుకున్న విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల ప్రకారం.. చర వ్యయం కింద యూనిట్‌కు 3.14 రూపాయల వంతున చెల్లిస్తున్నాయి. అంతకంటే తక్కువ ధర కోట్‌ చేసిన సంస్థకు నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని అధికారులు భావిస్తున్నారు. స్థిర ఛార్జీల కింద యూనిట్‌కు 1.68 రూపాయల వంతున చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details