నెల్లూరులో రోడ్లు అధ్వాన్నంగా మారాయి. నగరంలోకి వచ్చే రహదారులు గోతులమయంగా మారాయి. చోదకులు భయం భయంగా వాహనాలను నడపాల్సిన దుస్థితి. మోకాళ్ల లోతు గుంతల్లో ఎప్పుడు, ఎక్కడ పడిపోతామో అర్థం కావడం లేదని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరంలోకి రావాలన్నా... చీకట్లో తిరిగి ఇళ్లకు వెళ్లాలన్నా ప్రమాదమేనని చోదకులు వాపోతున్నారు.
నరుకూరు, అల్లీపురం నుంచి నెల్లూరు నగరంలోకి ప్రవేశించే మార్గంలో రోడ్డు పరిస్థితి మరీ దారుణం. ముత్తుకూరు నుంచి వచ్చే రోడ్డు, జొన్నవాడ నుంచి నగరంలోకి ప్రవేశించే మార్గం ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్నాయి. చాలా చోట్ల సిమెంట్ రోడ్లు సైతం గుంతలుగా మారాయి. రోజూ నరకం కనిపిస్తున్నా....నగరపాలక సంస్థ వీటిని పూడ్చడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.