ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పీఎస్‌ఎల్‌వీ.. ఇస్రో విజయాశ్వం - pslv history

తిరుగులేని విజయాలకు పెట్టింది పేరు.. అర్ధశతకం దిశగా దూసుకెళ్తున్న ధీరుడు.. ఆదాయ సముపార్జనలోనూ ముందున్న మొనగాడు.. చెప్పాలంటే ఇంకా ఎన్నెన్నో. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ముద్దుబిడ్డ, ముంగిట్లో సగర్వంగా నిలిచిన విజయాశ్వం.. రికార్డులు  బద్దలుకొట్టే పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికిల్‌ (పీఎస్‌ఎల్‌వీ). 27 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో దేశాలు అసాధ్యం అనుకున్నదాన్నీ సుసాధ్యం చేసిన పీఎస్‌ఎల్‌వీ.. గురువారం ఈ శ్రేణిలోని 50వ వాహనం నింగిలోకి దూసుకెళ్లిన  నేపథ్యంలో ప్రత్యేక కథనం.

pslv success story
పీఎస్‌ఎల్‌వీ

By

Published : Dec 17, 2020, 7:17 PM IST


భారత అంతరిక్ష పరిశోధన సంస్థ స్వయంగా రూపొందించి, అభివృద్ధి చేసిన ఉపగ్రహ వాహకనౌక పీఎస్‌ఎల్‌వీ. 1993లో తొలి ప్రయోగం జరిగిన దీనిద్వారా ఇప్పటికి 374 ఉపగ్రహాలు (46 స్వదేశీ, 328 విదేశీ) విజయవంతంగా కక్ష్యలోకి చేరాయి. ప్రతిష్ఠాత్మకమైన చంద్రయాన్‌-1, మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్‌, స్పేస్‌ క్యాప్సూల్‌ రికవరీ ప్రయోగం, ఇండియన్‌ రీజినల్‌ నేవిగేషన్‌ శాటిలైట్‌ సిస్టమ్‌ తదితరాలన్నీ ఈ వాహకనౌక ద్వారానే ప్రయోగించారు. 1970-80లో శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (ఎస్‌ఎల్‌వీ) ద్వారా అంతరిక్ష ప్రయాణాన్ని ప్రారంభించిన ఇస్రో.. తర్వాత ఆగ్‌మెంటెడ్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (ఏఎస్‌ఎల్‌వీ)ని నిర్మించి వినియోగించింది. ఈ రెండూ ప్రపంచ యవనికపై భారత ఉనికిని చాటినా.. ఆశించిన ఫలితాలు రాలేదు. దాంతో 1990-2000 మధ్యకాలంలో పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను మూడోతరం కింద నిర్మించారు.

వైఫల్యం నుంచి విజయం వైపు..
1993 సెప్టెంబరు 20న పీఎస్‌ఎల్‌వీ-జి వాహకనౌక ద్వారా పీఎస్‌ఎల్‌వీ-డి1 ప్రయోగాన్ని చేపట్టగా, అది విఫలమైంది. తర్వాత 1994, 1996లో పీఎస్‌ఎల్‌వీ-డి2, డి3 ప్రయోగాలు చేయగా.. ఆ రెండూ విజయవంతమయ్యాయి. ఆ తర్వాత నుంచీ ‘సి’ సిరీస్‌ ప్రయోగాలు మొదలయ్యాయి. 1997 సెప్టెంబరు 29న పీఎస్‌ఎల్‌వీ-సి1 ప్రయోగం జరగ్గా.. ఐఆర్‌ఎస్‌-1డి ఉపగ్రహాన్ని సూర్యానువర్తన కక్ష్యలోకి పంపించారు. ఇక వరుసగా ప్రయోగాలు జరిగాయి. పీఎస్‌ఎల్‌వీ-సి13 ప్రయోగం ఒక్కటే జరగలేదు.

క్రమంగా మెరుగుపడుతూ..
అవసరాలకు అనుగుణంగా ఈ వాహకనౌక సామర్థ్యం మెరుగుపడుతూ వచ్చింది. 1993లో పీఎస్‌ఎల్‌వీ-జిగా గుర్తింపు పొందగా.. ఆ తర్వాత 2007 ఏప్రిల్‌ 23 నాటి ప్రయోగానికి పీఎస్‌ఎల్‌వీ-సీఏగా మారింది. 2008 అక్టోబరు 22 నాటికి చంద్రయాన్‌-1 ప్రయోగానికి ఎక్సెల్‌గా రూపాంతరం చెందింది. 2019 జనవరి 24 ప్రయోగానికి పీఎస్‌ఎల్‌వీ-డిఎల్‌, 2019 ఏప్రిల్‌ 1 ప్రయోగానికి పీఎస్‌ఎల్‌వీ-క్యూఎల్‌గా మారింది. ఇక్కడ వాహకనౌక సాంకేతికంగా అయిదు రకాలుగా మారగా.. దాదాపు ప్రతిసారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. పీఎస్‌ఎల్‌వీ మొత్తం వాహకనౌకల్లో పీఎస్‌ఎల్‌వీ-డి1, పీఎస్‌ఎల్‌వీ-సి39 ప్రయోగాలు మాత్రమే విఫలమయ్యాయి.

ఉపగ్రహాలను మోసుకెళ్లడం

  • 1999 నుంచి ఇప్పటివరకు 34 దేశాలకు చెందిన 328 ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరాయి.

పీఎస్‌ఎల్‌వీ మన ఘనత

భారతదేశ కీర్తి ప్రతిష్ఠలను ప్రపంచస్థాయిలో ఇనుమడింపజేసిన ఇస్రోకు జవసత్వాలు చేకూర్చింది పీఎస్‌ఎల్‌వీ. ముంగిట విజయాశ్వంగా నిలిచి ఎన్నో ప్రయోగాలకు ప్రాణం పోసింది. అలాంటి పీఎస్‌ఎల్‌వీ సి సిరీస్‌లో 50వ వాహకనౌకను ప్రయోగిస్తుండటం చాలా సంతోషంగా ఉంది. ఇస్రో స్వయంకృషితో సాంకేతిక నైపుణ్యాన్ని సంపాదించి ప్రపంచంలోనే తిరుగులేని శక్తిగా నిలిచింది. ప్రపంచ ఉపగ్రహ విపణిలోనూ సుస్థిర స్థానాన్ని సాధించింది.-- వెల్లంకి శేషగిరిరావు, షార్‌ విశ్రాంత అసోసియేట్‌ డైరెక్టర్‌

ఇదీ చదవండి: పీఎస్‌ఎల్‌వీ-సి50 ప్రయోగం విజయవంతం

ABOUT THE AUTHOR

...view details