సింహాచలం దేవస్థానం ఆభరణాల పేరిట మహిళ మోసానికి పాల్పడిన కేసులో నగదును రికవరీ చేశారు నెల్లూరు సీసీఎస్ పోలీసులు. విశాఖపట్నంలో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న నిందితురాలని నెల్లూరు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఆమె నుంచి సేకరించిన వివరాలతో చీటింగ్ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
'అప్పన్న బంగారం' కేసులో నగదు రికవరీ
అప్పన్న బంగారం పేరిట ఓ మహిళను మరో మహిళ నమ్మించి మోసం చేసిన కేసులో నెల్లూరు సీసీఎస్ పోలీసులు నగదు రికవరీ చేశారు. నిందితురాలి నుంచి భారీగా బంగారం, సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.
విశాఖపట్నానికి చెందిన హైమావతి అనే మహిళ... నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన శ్రావణితో పరిచయం ఏర్పరచుకుంది. స్నేహంగా ఉన్నట్లు నటిస్తూ సింహాచలం ఆలయంలో ఆభరణాలు వేలం వేస్తున్నారని... తక్కువ ధరకు వాటిని సొంతం చేసుకోవచ్చని మాయమాటలు చెప్పి శ్రావణితో పాటు మరో ఐదుగురి వద్ద నుంచి 38 లక్షల రూపాయల నగదు వసూలు చేసింది. తీరా బంగారం ఆభరణాలు ఇవ్వకపోగా... ఆ మొత్తాన్ని హైమావతి తన సొంత అవసరాలకు వినియోగించుకుంంది.
మోసపోయానని గ్రహించిన శ్రావణి సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ ఈ కేసును సీసీఎస్ స్టేషన్కు బదలాయించారు. కేసు నమోదు చేసిన సీపీఎస్ పోలీసులు... విశాఖపట్నంలో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న హైమావతిని అదుపులోకి తీసుకొని చీటింగ్ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. 30 లక్షల విలువ చేసే 280 గ్రాముల బంగారు ఆభరణాలు, 11.35 లక్షల నగదుతో పాటు ఏసీ, ఫ్రిజ్, ద్విచక్ర వాహనం వంటి ఖరీదైన సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు సీసీఎస్ సీఐ బాజాజాన్ సైదా వెల్లడించారు. నిందితురాలు హైమావతిని తిరిగి జ్యుడిషియల్ కస్టడీకి పంపినట్లు తెలిపారు.