ANIMAL AMBULANCE: రాష్ట్రంలో 278 కోట్ల రూపాయల వ్యయంతో 340 పశువుల అంబులెన్సులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. తొలిదశలో 143 కోట్ల రూపాయల వ్యయంతో 175 అంబులెన్సుల ద్వారా సేవలను మే 19న ముఖ్యమంత్రి ప్రారంభించారు. వీటిని నియోజకవర్గానికి ఒకటి చొప్పున కేటాయించారు. పశువైద్య అంబులెన్సుల నిర్వహణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులు భరిస్తాయి. ఒక్కో వాహనంలో పశు వైద్యుడు, డిప్లొమా చేసిన సహాయకుడు, డ్రైవర్ కమ్ అటెండరు ఉంటారు. వైద్యుడికి 40వేల రూపాయలు, సహాయుడికి 17 వేల 500 రూపాయలు, డ్రైవరుకు 13 వేల 280 చొప్పున చెల్లిస్తారు. ఇందులోనే బీమా, పీఎఫ్ వంటి సౌకర్యాలుంటాయి.
ఏడాదికి 15 శాతం చొప్పున ఇంక్రిమెంట్ ఇస్తారని నిబంధనల్లో పేర్కొన్నారు. తొలిదశలో కేటాయించిన 175 అంబులెన్సుల నిర్వహణ, పశు వైద్య సేవలు అందించేందుకు రెండేళ్ల కాలానికి పశు సంవర్ధకశాఖ టెండర్లను ఆహ్వానించగా.. జీవీకే అత్యవసర సేవల నిర్వహణ, పరిశోధన సంస్థ దక్కించుకుంది. ఒక్కో అంబులెన్సు నిర్వహణకు నెలకు లక్షా 67 వేల 787 చొప్పున చెల్లించేలా ఒప్పందం కుదిరింది. పశువులు, మేకలు, గొర్రెలు, పెంపుడు జంతువులకు ప్రాథమిక వైద్యసేవలతోపాటు చిన్న శస్త్ర చికిత్సలు చేసేందుకు వీలుగా వీటిలో ఏర్పాట్లు చేశారు.