నెల్లూరులో ఓ యువకుడిని కర్రలతో చితకబాదిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంతోనే ఈ దాడి జరిగినట్లు మీడియాలో రావడంతో విచారించిన పోలీసులు అలాంటిదేమీ లేదని ప్రకటించారు. ఆర్థిక లావాదేవీలతోనే ఈ దాడులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. వైరల్ అయిన వీడియోలు గతేడాది నవంబర్, ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగినట్లు స్పష్టం చేశారు.
దాడికి పాల్పడిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు పోలీసులు. ఈ దాడులకు క్రికెట్ బెట్టింగ్తో ఎలాంటి సంబంధం లేదని నెల్లూరు పట్టణ, గ్రామీణ డీఎస్పీలు శ్రీనివాసులురెడ్డి, హరినాథ్ రెడ్డిలు తెలిపారు. హోటల్ బిల్లు కట్టలేదని రేవంత్ అనే వ్యక్తిని రాజశేఖర్, రంజిత్‌లు గత ఏడాది నవంబర్‌లో దాడి చేశారని పోలీసులు తెలిపారు. అద్దెకు తీసుకున్న కారు ప్రమాదానికి గురికావడం, దానికి సంబంధించిన నగదు చెల్లించలేదన్న కారణంతో ఏప్రిల్‌లో యుగంధర్ అనే వ్యక్తిని రాజశేఖర్, కిరణ్ అనే వ్యక్తులు కర్రలతో కొట్టినట్లు చెప్పారు.