నెల్లూరుకు చెందిన స్థిరాస్తి వ్యాపారి హత్య కేసును పోలీసులు ఛేదించారు. విజయభాస్కర్‌రెడ్డి హత్య కేసులో నలుగురు నిందితుల అరెస్టు చేసి.. రిమాండ్‌కు తరలించారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు... కారు నంబర్ ఆధారంగా నిందితులు మల్లేశ్, సుధాకర్, కృష్ణంరాజుతో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆర్థిక లావాదేవీలే కారణమని పోలీసులు నిర్ధరించారు.
ఇదీ జరిగింది..
నెల్లూరుకు చెందిన గడ్డం విజయ్‌భాస్కర్‌రెడ్డి (63) హైదరాబాద్‌లో ఉంటూ స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నారు. నాలుగు నెలల నుంచి కేపీహెచ్‌బీ ఠాణా వెనక వైపు అడ్డగుట్టలోని నెస్ట్ అవే అనే హాస్టల్‌లో ఉంటున్నారు. గత నెల 20 నుంచి చరవాణి స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో ఆయన అల్లుడు జయసృజన్‌రెడ్డి కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హాస్టల్ సమీపంలోని సీసీ కెమేరాలను పరిశీలించడంతో.. అదే రోజు రాత్రి విజయ్‌భాస్కర్‌రెడ్డిని కారులో తీసుకెళ్తున్న దృశ్యం కనిపించింది. కారు నంబరు ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు మాజీ సైనికోద్యోగి మల్లేశ్, స్థిరాస్తి వ్యాపారి సుధాకర్, కృష్ణంరాజుతోపాటు ఓ వైద్యుడిని అదుపులోకి తీసుకొని విచారించడంతో హత్య కుట్ర బహిర్గతమైంది. విజయ్‌భాస్కర్‌రెడ్డిని అంతమొందించేందుకు సినీఫక్కీలో పథకం రచించినట్లు దర్యాప్తులో తేలింది.
మంచూరియాలో మత్తు మందు కలిపి..
కుట్రలో భాగంగా ఆయన ఉండే హాస్టల్‌లోనే చేరిన మల్లేశ్ కుమారుడు నమ్మకంగా మెలుగుతూ మంచూరియాలో మత్తుమందు కలిపి ఇచ్చినట్లు తేలింది. అది తిని స్పృహ తప్పి పడిపోయిన విజయ్‌భాస్కర్‌రెడ్డిని మల్లేశ్, సుధాకర్, కృష్ణంరాజు కారులో తీసుకెళ్లారు. ఆయనను బాగా కొట్టడంతో కారులోనే మృతిచెందారు. అనంతరం మృతదేహాన్ని నిందితులు శ్రీశైలంలోని సున్నిపెంటకు తీసుకెళ్లారు. ‘తమ బంధువు చనిపోయాడు దహనం చేయాలంటూ కాటికాపరిని నమ్మించారు. అతడికి రూ.11 వేల నగదు, గూగుల్ పే ద్వారా మరో రూ.4 వేలు చెల్లించారు. వీరి తీరుపై అనుమానంతో మృతదేహాన్ని చితిపై ఉంచిన సమయంలో కాటికాపరి తన సెల్‌ఫోన్‌తో ఫొటో తీసి ఉంచుకున్నాడు. శవదహనం అనంతరం నిందితులు ఆ రోజంతా అక్కడే గడిపి తిరిగి వచ్చేశారు.