నెల్లూరులో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో గృహాల్లోకి లబ్ధిదారులు ప్రవేశించేందుకు చేసిన ప్రయత్నం ఉద్రిక్తతకు దారి తీసింది. లబ్ధిదారులకు గృహాలు కేటాయించి రెండు ఏళ్లు గడుస్తున్నా ఇంకా వాటిని అప్పగించకపోవడాన్ని నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో పట్టణ పౌర సమాఖ్య శుక్రవారం ఆందోళనకు దిగింది. పేదలతో కలిసి టిడ్కో గృహాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. నగరంలోని జనార్థన్ రెడ్డి కాలనీ నుంచి ప్రదర్శనగా వెళ్తున్న సమైక్య నాయకులను భారీగా మోహరించిన పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులను తోసుకుంటూ ఇళ్ల వద్దకు వెళ్లేందుకు నిరసనకారులు ప్రయత్నించటంతో ఇరువర్గాల మధ్య కొంతసేపు తోపులాట జరిగింది. అనంతరం లబ్ధిదారులతో కలిసి రోడ్డుపైనే బైఠాయించిన నాయకులు.... రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు.
నెల్లూరులో ఉద్రిక్తత... నిరసనకారులు, పోలీసుల మధ్య తోపులాట - tidco houses issue in nellore news
టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అప్పగించాలంటూ సీపీఎం ఆధ్వర్యంలో నెల్లూరులో పట్టణ పౌర సమాఖ్య నిరసన చేపట్టింది. గృహాల్లోకి ప్రవేశించేందుకు లబ్ధిదారులు, నాయకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. వారి మధ్య తోపులాట జరిగింది.
![నెల్లూరులో ఉద్రిక్తత... నిరసనకారులు, పోలీసుల మధ్య తోపులాట tidco houses](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9196348-842-9196348-1602843222448.jpg)
tidco houses
తెదేపా, వైకాపా రాజకీయాల కోసం ప్రజలను బలి చేయడం దారుణమని పట్టణ పౌర సమాఖ్య రాష్ట్ర నేత బాబురావు ఆందోళన వ్యక్తం చేశారు. భాజపా, వైకాపాలు కుమ్మక్కై పేదల కోసం నిర్మించిన ఇళ్లను వారికే అద్దెకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్లకు వడ్డీలు కట్టమని బ్యాంకులు నోటీసులు ఇస్తున్నాయని చెప్పారు. పది రోజుల్లో పేదలకు గృహాలు అప్పగించకపోతే తాళాలు పగలగొట్టి ఇళ్లలోకి ప్రవేశిస్తామని హెచ్చరించారు.