నెల్లూరు పట్టణానికి కలుషిత నీరే దిక్కవుతోంది. సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నుంచి పట్టణంలోని వివిధ ప్రాంతాలకు నీటి సరఫరా జరుగుతుండగా.. క్లోరినేషన్ చర్యలు నామమాత్రంగా పూర్తి చేస్తున్నారు. ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్వహణ సరిగా లేదు. ట్యాంకులపై మూత ల్లేవు. సంపులు సైతం ధ్వంసమయ్యాయి. ట్యాంకుల్లో నీరు పచ్చగా రంగు మారి ఉండగా- దాన్ని శుద్ధి చేయకుండానే కుళాయిలకు సరఫరా చేస్తున్నారు. ఈ విషయమై మున్సిపల్ డీఈఈ శ్రీనివాస్‌ను వివరణ కోరగా- తుపాను సందర్భంలో సమ్మర్ స్టోరేజీ వద్ద క్లోరినేషన్ జరగలేదని, కలుషిత నీటి సరఫరాను అదుపు చేస్తామని తెలిపారు.
రెండు గ్రామాల్లోనే...
మండలంలోని 23 పంచాయతీల్లో 32 ఓవర్‌హెడ్ ట్యాంకులు, మరో 42 డైరెక్ట్ పంపింగ్ పథకాలు ఉండగా- ట్యాంకుల్లో 10 వేల లీటర్లకు తాజాగా తీసుకొచ్చిన బ్లీచింగ్ పౌడర్ 40 గ్రాములు కలిపి క్లోరినేషన్ చేయాలని పంచాయతీ కార్యదర్శులకు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ఆదేశించారు. కానీ, నిల్వ బ్లీచింగ్‌ను వాడుతున్నారు.కేవలం నాగసముద్రం, గంగిరెడ్డిపాలెం పంచాయతీల్లో మాత్రమే ట్యాంకుల్లో క్లోరినేషన్ జరిగింది. మిగిలిన గ్రామాల్లో కలుషిత నీరే ప్రజలకు దిక్కవుతోంది. ఈ విషయమై ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈని వివరణ కోరగా- క్లోరినేషన్ చేయించి ఫొటోలు పంపాలని పంచాయతీ కార్యదర్శులకు తెలిపామన్నారు. మరోసారి వారితో మాట్లాడి ట్యాంకులు శుభ్రం చేయించి.. క్లోరినేషన్ చేయిస్తామన్నారు.
ఏడు మండలాల్లో అదే పరిస్థితి
స్వర్ణముఖి నదిలోని రాజీవ్ టెక్నాలజీ పథకాల నుంచి సూళ్లూరుపేట, గూడూరు నియోజకవర్గాల పరిధిలోని వందలాది గ్రామాలకు నీటి సరఫరా జరుగుతుండగా- నదిలో ప్రవహిస్తున్న నీరు పూర్తిగా రంగు మారింది. దీన్నే నది పొడవునా ఉండే గ్రామాలకు సరఫరా చేస్తున్నారు. రాజీవ్ టెక్నాలజీ, స్థానిక తాగునీటి పథకాల ద్వారా నాయుడుపేట, పెళ్లకూరు, ఓజిలి, దొరవారిసత్రం, కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లోని గ్రామాలకు నీరందిస్తున్నారు. ఆయా గ్రామాల్లోని పథకాల పైపులైన్ల నుంచి పూర్తిగా రంగుమారిన నీరు వస్తోంది. మూడు, నాలుగు రోజులుగా ఇవి వాడకానికి ఉపయోగపడటం లేదు. ప్రజలు కాచి వాడుకుంటున్నారు. ఏ ఒక్క గ్రామంలోనూ క్లోరినేషన్ చర్యలు చూద్దామన్నా కనిపించడం లేదు. పట్టణంలోనూ ఎక్కువ ప్రాంతాల్లో నిర్వహణ సరిగా లేదు. క్లోరినేషన్ విషయమై కమిషనర్ ఎల్.చంద్రశేఖర్‌రెడ్డిని వివరణ కోరగా కొన్నింటి ద్వారా చేస్తున్నామని, ఓవర్ హెడ్ ట్యాంకుల నుంచి సరఫరా చేసే నీటిలోనూ ఈ చర్యలు తీసుకుంటామన్నారు.