నెల్లూరు జిల్లాకు విస్తారమైన తీర ప్రాంతం ఉన్న కారణంగా.. తరచూ తుపాన్ల గండం పొంచి ఉంటుంది. అందుకు తగ్గట్లుగా జిల్లాలో ఏర్పాట్లు లేవు. వర్షాకాలం ప్రారంభంలోనే అధికారులు అప్రమత్తమయితే ముప్పు నుంచి బయటపడే అవకాశముంది. లేదంటే 2015లో జరిగిన విపత్తే మళ్లీ వచ్చే అవకాశం లేకపోలేదు.
2015 నవంబరు, డిసెంబరుల్లో జిల్లాలో రెండు సార్లు వరద బీభత్సం సృష్టించింది. రికార్డు స్థాయిలో 827 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. స్వర్ణముఖి, కాళంగి, పెన్నా నదులు పొంగి పరిసర గ్రామాలన్నీ నీటి మునిగాయి. మనుబోలు వద్ద జాతీయ రహదారికి గండ్లు పడ్డాయి. సూళ్లూరుపేట జాతీయ రహదారిపై వరద నీరు పొంగి పొర్లి రహదారి కోతకు గురైంది.
కొద్ది రోజులపాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 29 మంది మృతి చెందారు. అన్నదాతలు ఆర్థికంగా చితికిపోయారు. సుమారు రూ.2,226.86 కోట్ల మేర నష్టం వాటిల్లింది. తాత్కాలిక మరమ్మతులకే రూ.1000 కోట్లు ఖర్చు అవుతాయని అధికారులు అప్పట్లో అంచనాలు వేశారు.
ప్రస్తుతం నైరుతీ రుతుపవనాలు చురుగ్గా ఉన్న కారణంగా.. తరచూ వర్షాలు పడుతున్నాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని జిల్లా అధికార యంత్రాంగం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటే నష్టశాతాన్ని తగ్గించినవారవుతారు. కానీ ఆదిశగా చర్యలు ఎక్కడా కనిపించడం లేదు. సూళ్లూరుపేట మండలంలోని ఉగ్గుమూడి, మతకామూడి పంచాయతీ రాజ్ రహదారులు నేటికి మరమ్మతుకు నోచుకోలేదు. వట్రపాళెం ఇంకా లోతట్టు ప్రాంతంగానే ఉంది. ఇక్కడకు చేరే వరద నీరు వెళ్లేలా ఎలాంటి చర్యలు చేపట్టలేదు.