ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆత్మకూరు పుర పోరు.. వెల్లువెత్తుతున్న అభివృద్ధి ఆకాంక్షలు - ఏపీ మున్సిపల్ ఎన్నికల అప్​డేట్స్

అక్కడి గ్రామాలు పట్టణ రూపు దాల్చాయి. పురపాలిక అవతారంతో కొత్త సౌకర్యాలు సంతరించుకున్నాయి. మరిన్ని సమస్యలు పరిష్కారం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాయి. పురపోరుకు సమయం ఆసన్నమైన వేళ అభివృద్ధి ఆకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

athmakuru municipal elections
ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికలు

By

Published : Feb 26, 2021, 3:46 PM IST

ఆధునిక సౌకర్యాలతో క్రమంగా పట్టణీకరణ దిశగా అడుగులు వేస్తున్న నెల్లూరు జిల్లా ఆత్మకూరు పురపాలక సంఘానికి రెండోసారి ఎన్నికలు జరగనున్నాయి. 2012లో పురపాలక సంఘంగా ఏర్పడిన ఈ ప్రాంతంలో జనాభా ప్రస్తుతం 30వేలు దాటింది. అప్పట్లో వెంకట్రావుపల్లి, నర్సాపురం, తెల్లపాడు గ్రామాలు కలిపి 23వార్డులతో, 5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పురపాలక సంఘంగా ఏర్పాటు చేశారు. ఛైర్మన్ పదవి ఎస్టీ మహిళకు రిజర్వేషన్‌తో 2014లో మొదటిసారి ఎన్నికలు జరగగా రాగి వనమ్మ మొదటి ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. వైస్ ఛైర్మన్ పదవిని సీపీఎం అభ్యర్ధి సందాని, తెలుగుదేశం అభ్యర్ధి చంద్రారెడ్డి చెరో రెండున్నర ఏళ్లు పంచుకున్నారు.

ప్రస్తుతం ఆత్మకూరులో అనేక సమస్యలు పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నాయి. 23 వార్డుల్లోనూ మురుగునీటి పారుదల వ్యవస్థ సరిగా లేదు. బేర్ పేట, తూర్పు వీధి, పెద్ద మసీదు సెంటర్‌లో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం సహా.. రోడ్ల మీదే వ్యర్థాలు పారబోసే పరిస్థితి నెలకొంది. అనేక భవనాల పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. పాలకవర్గం లేకపోవడం, రెండేళ్లుగా నిధులు రానందున ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి.

పురపాలక సంఘంగా ఏర్పడిన కారణంగా పలు అభివృద్ధి పనులు చేయగలిగామని అధికారులు చెబుతున్నారు. రెండోసారి ఎన్నికలు జరగనున్న వేళ.. ఈసారి పోటీ మరింత తీవ్రంగా ఉండే పరిస్థితి కనిపిస్తోంది.

ఆత్మకూరు పుర పోరు

ఇదీ చదవండి: పుర ఎన్నికలపై ప్రాంతాల వారీ సమావేశాలు: ఎస్‌ఈసీ

ABOUT THE AUTHOR

...view details