నాలుగు నెలలుగా కరోనా, లాక్‌డౌన్ ప్రభావంతో ప్రతీ రంగం చెల్లాచెదురైంది. ఉన్నవారు, లేనివారు అన్న వ్యత్యాసమే లేకుండా అందరి ప్రణాళికలను తారుమారు చేసిందీ మహమ్మారి. రోజువారీ వేతనాలు, ఆదాయంపై ఆధారపడి జీవించే వారి పరిస్థితిని ఎంత వర్ణించినా తక్కువే! ఈ కోవలోకే వస్తారు నెల్లూరు జిల్లాలోని కొయ్య బొమ్మలు చేసే కళాకారులు.
అమ్ముడుకాని బొమ్మలు
నెల్లూరు, కావలి, గూడూరు, నాయుడుపేట, తడ, ఆత్మకూరు ప్రాంతాల్లో సుమారు 25 వేల కుటుంబాలు చెక్కపనిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. కొందరు అడవుల నుంచి కొయ్యను కొట్టుకొస్తే... మరికొందరు వాటిని బల్లలు, కుర్చీలు, చెక్కబీరువాలు, పీటలుగా చెక్కుతారు. కడుపు నిండాలంటే ఏ రోజుకారోజు పని చేయాల్సిందే..! ఐతే కరోనా దెబ్బకు నాలుగు నెలలుగా చెక్కిన వస్తువులను అమ్ముకోలేక, అర్ధాకలితో అల్లాడుతున్నారు.