నెల్లూరు జిల్లాలోని 38 కొవిడ్ కేర్ సెంటర్లు, కొవిడ్ ఆసుపత్రుల అధికారులతో మంత్రులు సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రులు మేకపాటి గౌతంరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, ప్రత్యేక అధికారులు, సంయుక్త కలెక్టర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా ఆక్సిజన్ సరఫరాపై సుదీర్ఘ చర్చ సాగింది. జిల్లాకు కావలసిన ఆక్సిజన్, ఐసీయూ బెడ్స్, వెంటిలెటర్ల కొరత గురించి చర్చించారు.
కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలతో మాట్లాడి కొరత తీరుస్తామని మంత్రి గౌతం రెడ్డి చెప్పారు. నెల్లూరు జీజీహెచ్లో పనిచేసే జూనియర్ వైద్యులను ఐసీయూలో 12 గంటలు పని చేయిస్తున్నారని... దీనివల్ల ఇబ్బందులు పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. 8 గంటలకు మించి పని చేయించవద్దని ఆదేశాలు ఇచ్చారు. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో బెడ్స్ కేటాయించడంలో ఇబ్బందులకు గురిచేస్తున్నారని... డబ్బుల కోసం పనిచేయవద్దని హెచ్చరించారు.