'స్పిల్‌వేపై కాస్త నీరు వెళ్తే అంత రాద్ధాంతమా' - మంత్రి అనిల్ కుమార్
శ్రీశైలం జలాశయంపై అవగహన లేమితో ప్రతిపక్ష నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మంత్రి అనిల్ మండిపడ్డారు. అలల దాటికి స్పిల్ వే పై నుంచి కాస్త నీరు పోతే డ్యాంకు ఏదో ప్రమాదం జరిగిపోతున్నట్లు తెదేపా నేతలు మాట్లాడటం సరికాదని అన్నారు

అవగాహన రాహిత్యంతోనే ప్రతిపక్ష నాయకులు శ్రీశైలం జలాశయంపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. పూర్తి స్థాయిలో జలాశయం నిండడంతో అలల దాటికి స్పిల్ వే పై నుంచి కాస్త నీరు పోతే డ్యాంకు ఏదో ప్రమాదం జరిగిపోతున్నట్లు తెదేపా మాట్లాడటం హాస్యాస్పదమని ఆయన నెల్లూరులో విమర్శించారు. గతంలో డ్యాంపై నుంచి భారీగా నీరుపోవడంతో పవర్ హౌస్ దెబ్బతిని 500 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని గుర్తు చేశారు. ఇప్పుడు కేవలం మూడు గేట్ల నుంచి నీరు పోతే కర్నూలు మునిగిపోతున్నట్లు ప్రచారం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జలాశయాలన్ని నిండడం, పంటలకు ఇబ్బంది లేకుండా నీరు ఇస్తామన్న అక్కసుతోనే తెలుగుదేశం పార్టీ ఇలాంటి ప్రచారం చేస్తోందని మంత్రి విమర్శించారు.