Gowtham reddy: దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కుమారుడు మేకపాటి కృష్ణార్జున రెడ్డి నెల్లూరు జిల్లా సంగం పెన్నానదిలో తండ్రి అస్థికలు నిమజ్జనం చేశారు. శాస్త్రానుసారం క్రతువు నిర్వహించారు. అనంతరం అక్కడికి చేరుకున్న వైకాపా నాయకులకు, కార్యకర్తలకు చేతులెత్తి అభివాదం చేసి..ప్రతీ ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించారు. అచ్చం తన తండ్రిలాగే అభివాదం చేయడంతో నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. మేకపాటి కృష్ణార్జున రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలని పెద్దగా నినాదాలు చేశారు.
గుండెపోటుతో కన్నుమూత..
మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి (49) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఈ నెల 21 ఉదయం గుండెపోటు రావడంతో హుటాహుటిన గౌతమ్‌రెడ్డిని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. గౌతమ్ రెడ్డి ఇంటి వద్ద కుప్పకూలడంతో ఉదయం 7.45గంటలకు ఆస్పత్రికి తీసుకొచ్చారని వైద్యులు తెలిపారు. స్పందించని స్థితిలో మంత్రి ఆస్పత్రికి వచ్చారన్నారు. ఆస్పత్రికి వచ్చే సమయానికే గౌతమ్‌రెడ్డికి శ్వాస ఆడట్లేదని వైద్యులు తెలిపారు. తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయిందని చెప్పారు. అనంతరం గౌతమ్‌రెడ్డి చనిపోయినట్లు 9.16గంటలకు అపోలో వైద్యులు ప్రకటన విడుదల చేశారు.
గౌతమ్‌రెడ్డి రాష్ట్ర ఐటీ, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గత వారం రోజులుగా దుబాయ్ ఎక్స్‌పోలో ఆయన పాల్గొన్నారు. ఏపీకి పెట్టుబడులు తీసుకొచ్చే అంశంపై పలు సంస్థలతో సంప్రదింపులు జరిపారు. కొన్ని సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకున్నారు. దుబాయ్ ఎక్స్‌పోలో పాల్గొన్న అనంతరం ఆదివారం(21న) హైదరాబాద్ చేరుకున్నారు.
ఏపీలో అధికార వైఎస్సార్‌సీపీకి ఆది నుంచి బలమైన మద్దతుదారుగా ఉన్న పారిశ్రామికవేత్త, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కుమారుడు గౌతమ్ రెడ్డి. ఆయన నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రెండుసార్లు గౌతమ్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014, 2019 ఎన్నికల్లో వైకాపా తరఫున ఆయన విజయం సాధించారు.