ఆసియా ఖండంలోనే అతి పొడవైన మట్టి కట్ట కలిగిన జలాశయంగా కండలేరుకు గుర్తింపు ఉంది. సుమారు 11 కి.మీ. పొడవుతో ఉన్న ఈ నిర్మాణంపై నెల్లూరు, చిత్తూరు జిల్లాల సాగు, తాగునీటి అవసరాలు ఆధారపడి ఉండగా చెన్నై దాహార్తిని సైతం తీరుస్తోంది. ఇంతటి కీలకమైన ఈ జలాశయంలో 68 టీఎంసీలు నిల్వ చేసుకునే సామర్థ్యం ఉండగా- సోమశిల నుంచి ప్రత్యేక వరద కాలువ ఉన్నా అది 11 వేల క్యూసెక్కుల సామర్థ్యమే ఉండటంతో ఎప్పుడూ కండలేరులో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయలేని దుస్థితి. అకాల వరద సమస్య ఉండే సోమశిల జలాశయం నుంచి కండలేరుకు ప్రస్తుత పరిస్థితుల్లో నీరు తరలించాలంటే రోజుకు 1 టీఎంసీ చొప్పున 60 రోజులు పడుతుంది. అకాల వరద 20 నుంచి 30 రోజుల మధ్యనే ఉండటంతో కండలేరును నింపడం కష్టతరమవుతోంది. దీంతో వరద కాలువ సామర్థ్యాన్ని 22 వేల క్యూసెక్కులకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించి టెండర్ల దిశగా అడుగులు వేస్తోంది. ఇంత వరకు బాగానే ఉన్నా... ప్రస్తుతం జలాశయం వద్ద ఉన్న సమస్యలు మరింత ఇబ్బందిగా మారాయి.
ఇదీ పరిస్థితి
జలాశయం కట్ట పటిష్ఠత, స్పిల్‌వే నిర్మాణ పనుల పరంగా ఏళ్ల తరబడి నిర్లక్ష్యం నెలకొనడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ప్రధానంగా పుష్కరం కిందట ప్యాకేజీ-9లో రూ. 28 కోట్ల అంచనా వ్యయంతో స్పిల్‌వే నిర్మాణ పనులు చేపట్టారు. రూ. పది కోట్ల విలువైన పనులు జరగ్గా... కాంక్రీట్ కట్టడాలు పూర్తి చేశారు. రేడియల్ గేట్ల ఏర్పాటులో తాత్సారం జరుగుతోంది. దీంతోపాటు 0-500 మీటర్ల మధ్య అటవీ అనుమతులు రాకపోవడంతో పనులు జరగడం లేదు. 600-1200 మీటర్ల మధ్య పూర్తి కాగా.. 1200-2000 మీటర్ల మధ్య టెయిల్ ఛానల్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. అటవీ అనుమతుల వ్యవహారాన్ని పలుమార్లు ఆ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి కండలేరు అధికారులు తీసుకువెళ్లినా కొర్రీలు పడటం పరిపాటిగా మారింది. ఓ దశలో సీతారామపురం వద్ద ప్రత్యామ్నాయ స్థలం చూపేందుకు అంగీకరించినా.. సమస్య కొలిక్కి రాలేదు. ఇక్కడ ప్రత్యామ్నాయ కాలువ నిర్మాణం చేపట్టడంపైనా అధికారులు యోచిస్తున్నారు. నమూనా విభాగం దృష్టికి సమస్యను తీసుకువెళ్లారు.
నిల్వకు అగచాట్లు..
గత నెల రోజులుగా సోమశిలకు వస్తున్న వరదను కండలేరుకు కొంత, దిగువకు కొంత వదిలారు. కండలేరు పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 68 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 50టీఎంసీలకు చేరింది. మరో పది టీఎంసీలు నింపడం ద్వారా 60 టీఎంసీలు ఉంచేందుకు అధికారులు యత్నిస్తుండగా... ఇక్కడే అసంపూర్తి పనులు ఇబ్బందిగా మారాయి. ప్రధానంగా స్పిల్‌వే వద్ద ఇబ్బంది ఏర్పడింది. ఇక్కడ 83.3 మీటర్ల మట్టానికి నిల్వ పెడితే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్ఛు కానీ, 82.3 మీటర్లకు పెట్టగానే స్పిల్‌వే వద్ద నీరు పొర్లి దిగువకు పోతోందని అధికారులు తేల్చారు. ఈ స్థితిలో ఆ ప్రాంతంలో రూ. 30 లక్షల వ్యయంతో తాత్కాలికంగా మట్టికట్ట (రింగ్‌బండ్) వేస్తున్నారు. గత వారం రోజులుగా ఈ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇక్కడ స్పిల్‌వేకు రేడియల్ గేట్లు పెట్టాలంటే మూడు నెలల సమయం పడుతుంది. ఒక్కో గేటు ఏర్పాటుకు నెల రోజులు పడుతుంది. ఆ లెక్కన వచ్చే ఏడాది జనవరికి పూర్తి కావచ్చని అంచనాకు వచ్చారు. ప్రస్తుతం వరదనీరు వస్తుండటంతో దాన్ని ఎలాగైనా 60 టీఎంసీ మట్టానికి నిల్వ చేసుకోవాలనే ప్రయత్నంలో యుద్ధప్రాతిపదికన రింగ్‌బండ్ నిర్మాణం చేస్తున్నారు. మరో 8 టీఎంసీల సామర్థ్యమూ జలాశయం కలిగి ఉండగా.. నిర్వాసితులకు పరిహారం, పునరావాసం సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదు. గుండవోలు, రేగడిపల్లి తదితరాలు జలాశయంలోనే ఉండటంతో ఆ మేరకు నింపలేని దుస్థితి. స్పిల్‌వే వద్ద రింగ్‌బండ్ ద్వారా సమస్య పరిష్కరించేందుకు సిద్ధమయ్యారు.
అన్నీ అంతే..
చివరకు గ్రౌటింగ్‌లోనూ నాలుగేళ్లుగా నిర్లక్ష్యమే కనిపిస్తోంది. కండలేరు కట్టను పటిష్ఠ పరచే క్రమంలో అధికారులు గ్రౌటింగ్ ప్రక్రియకు ప్రతిపాదించడం.. ఆ మేరకు నిధులు మంజూరు కావడం తెలిసిందే. మూడు ప్యాకేజీల్లో పనులు జరుగుతుండగా.. ఇవి ఏళ్లుగా ఆగుతూ.. సాగుతూ కొనసాగుతున్నాయి. ఆరు నెలల క్రితం మళ్లీ ప్రారంభం కాగా.. ఇప్పటికి రెండు ప్యాకేజీల్లో పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. మూడో కిలోమీటరు నుంచి 5వ కిలోమీటరు వరకు ప్రస్తుతం పనులు జరుగుతున్నట్లు స్పష్టం చేస్తున్నారు. జలాశయంలో నీటి నిల్వ తక్కువగా ఉన్నప్పుడు ఈ పనులు పూర్తిచేసి ఉంటే బాగుండేదన్న వాదన వినిపిస్తోంది. ఓ వైపు తాత్కాలిక నిర్మాణాలు చేపడుతూ, మరోవైపు నీటినిల్వ చేసేందుకు ప్రయత్నిస్తుండటం చర్చలో నిలుస్తోంది. రింగ్‌బండ్ నిర్మాణం పటిష్ఠంగా చేపట్టాల్సిన అవసరం ఉంది. కండలేరులో 60టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు సిద్ధమైనట్లు కండలేరు ఈఈ విజయ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఆ మేరకు స్పిల్‌వే పనులు పూర్తికాకపోవడంతో ఉన్నతాదేశాల మేరకు తాత్కాలికంగా రింగ్‌బండ్ వేస్తున్నామని వివరించారు.
ఇదీ చదవండి:ఊళ్లకు నిధులు.. ఇళ్లకు నీళ్లు!