నెల్లూరు నగరంలోని మైపాడు రోడ్డులో ఉన్న బాలాజీ కెమికల్స్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడం వల్ల స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్లతో అతికష్టం మీద మంటలు అదుపులోకి తెచ్చారు.
రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ సహాయక చర్యలను పర్యవేక్షించారు. పరిశ్రమలో హైడ్రోజన్ పెరాక్సైడ్‌తో పాటు పలు రసాయనాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముందు జాగ్రత్త చర్యగా చుట్టుపక్కల నివాసం ఉండే ప్రజలను.. అధికారులు ఖాళీ చేయించారు. విద్యుదాఘాతం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని మంత్రి తెలిపారు. నష్టం అంచనాలతోపాటు, ప్రమాద కారణాలను అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.