భారీ వర్షాలకు నెల్లూరులో తెగిన రహదారులు, దెబ్బతిన్న రైల్వేలైన్లు భారీ వర్షాలకు నెల్లూరులోని రహదారులు దెబ్బతిన్నాయి. వంతెనలు బలహీనపడి కూలిపోయే స్థితిలో ఉన్నాయి. అప్రమత్తమైన అధికారులు వాహనాల రాకపోకల్ని నిలిపేశారు. రహదారులకు మరమ్మతులు చేస్తున్నారు.
నెల్లూరు శివారులో పెన్నా నదిపై వంతెన బలహీనపడింది. దాంతో అర్ధరాత్రి 12 నుంచే జాతీయరహదారిపై వాహనాలు నిలిపివేశారు. మరోవైపు పెన్నా నది వద్ద 16వ నంబరు జాతీయ రహదారికి గండి పడింది. ఫలితంగా చెన్నై, బెంగళూరు నుంచి విజయవాడ వచ్చే వాహనాలను నిలిపివేశారు. నెల్లూరు బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సులు ఆగిపోయాయి.
"ఇలాంటి వరదల్ని ఎప్పుడూ చూడలేదు. భారీ వర్షాలకు మా కాలనీ మునిగిపోయింది. ప్రభుత్వం పడవలు పంపిస్తుందంటే రెండు రోజుల నుంచి వేచి చూశాం. వేచి చూసి ఇలా ఈత కొట్టుకుంటూ వచ్చాం. ఇప్పుడు వచ్చాయి పడవలు. నిన్నటి నుంచి ఎమీ తినలేదు. మామల్ని ఎవరూ ఆదుకోవట్లేదు."
-బాధితులు, నెల్లూరు జిల్లా
కడప - తిరుపతి మార్గంలో కూడా వాహనాల రాకపోకల్ని ఆర్టీసీ నిలిపివేసింది. చెన్నై - కోల్‌కతా 16వ నంబర్ జాతీయరహదారి దెబ్బతినడంతో వాహనాలు నిలిపివేశారు. వాహనాలు కడప, పామూరు, దర్శి వైపు వెళ్లాలని పోలీసులు సూచించారు. మరమ్మతులకు కనీసం 48 గంటలు పడుతుందని అధికారులు తెలిపారు.
కాగా సంగం మండలం కోలగట్ల వద్ద వరద ఉద్ధృతి తగ్గింది. ఫలితంగా నెల్లూరు నుంచి కడపకు వాహనాల రాకపోకలకు అనుమతినిచ్చారు.
భారీ వర్షాల ధాటికి రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో తిరుపతి - ఆదిలాబాద్ కృష్ణా ఎక్స్ప్రెస్ను రైల్వేశాఖ రద్దు చేసింది. నెల్లూరు - పడుగుపాడు మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వేటపాలెంలో పూరీ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది. రైళ్లలో ప్రయాణికుల అవస్థలు పడుతున్నారు.
తిరుపతి నుంచి శ్రీకాళహస్తి మీదుగా వచ్చే వాహనాలను అధికారులు నిలిపివేశారు. దాంతో తొట్టంబేడు వద్ద భారీగా వాహనాలు బారులు తీరాయి.
ఇదీ చదవండి:Tirupathi Still in flood water : వరద నీటిలో తిరుపతి.. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం