రాష్ట్రంలోనే అత్యధికంగా స్వర్ణాభరణాలు తయారుచేసే జిల్లాల్లో నెల్లూరు ఒకటి. నెల్లూరు నగరంతోపాటు, కావలి, నాయుడుపేట, సూళ్లూరుపేట, తడ, రాపూరు వరకు పెద్ద ఎత్తున స్వర్ణాభరణాలు విభిన్నంగా తయారు చేస్తారు. కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. ఇంత పెద్ద ఎత్తున వ్యాపారం జరిగే ఈ జిల్లాలో 25 వేల మంది నైపుణ్యం కలిగిన స్వర్ణకారులు ఉన్నారు. లక్షల మంది జనాభా ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు.
అర్థాకలితో జీవిస్తున్నాం...
కరోనా కారణంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో... నాలుగు నెలలుగా స్వర్ణకారులకు పనుల్లేక విలవిల్లాడుతున్నారు. బంగారం కొనుగోలు లేకపోవడంతో పెద్ద వ్యాపారులు కూడా తమకు పనులు ఇవ్వడం లేదని... కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వృత్తిపై ఆధారపడి... స్వర్ణకారులతో పాటు మెరుగు పనిచేసేవారు, చెక్కే పని, రాళ్లు, డైమండ్స్ బిగించేవారు, పాలిష్ చేసేవారు... ఇలా ఎంతో మంది పనుల్లేక పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంటి అద్దెలతో పాటు... దుకాణం అద్దెలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్వర్ణకారులు వాపోతున్నారు.