నెల్లూరు జిల్లాలో నాలుగో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్, ఓట్ల లెక్కింపు నిర్వహణకు రంగం సిద్దమైంది. ప్రశాంత వాతావరణంలో తుది విడతను పూర్తి చేసేందుకు జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. 4,39,526 మంది ఈసారి ఓటుహక్కును వినియోగించుకోనున్నట్లు కలెక్టర్ తెలిపారు. గత దఫా 84 శాతం ఓటింగ్ నెల్లూరులో నమోదు కాగా.. ఏడేళ్ల తర్వాత ఇప్పుడు జరగనున్న ఎన్నికల్లో ఆ సంఖ్యను పెంచడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా వృద్ధులు, వికలాంగులను పోలింగ్ కేంద్రాలకు తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకున్నారు.
ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను.. 150 అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ నిర్వహించేదుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 236 సర్పంచి స్థానాల్లో 55.. 2,338 వార్డులకు 810 ఏకగ్రీవంగా కాగా మిగిలిన 181 సర్పంచి, 1527 వార్డులకు పోలింగ్ జరగనుంది. 475 మంది సర్పంచిగా, 3,303 మంది వార్డు అభ్యర్ధులుగా బరిలో ఉన్నారు.