నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి వ్యతిరేకంగా జిల్లాలో వివిధ చోట్ల నిరసనలు, ర్యాలీలు నిర్వహించారు. వెంకటాచలం ఎంపీడీవో సరళకు మహిళ, ఉద్యోగ, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఎమ్మెల్యేపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించాయి.
అనికేపల్లిలో తన అనుచరుడి వెంచర్‌కు పంచాయతీ కుళాయి కనెక్షన్ ఇవ్వాలని కోటంరెడ్డి తనను బెదిరించినట్టు వెంకటాచలం ఎంపీడీవో సరళ నిన్న తెల్లవారుజామున పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నెల్లూరు కల్లూరిపల్లి హౌసింగ్ కాలనీలో ఉన్న తన ఇంటి మీదకు ఎమ్మెల్యే దౌర్జన్యానికి వచ్చినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదు తీసుకున్న పోలీసులు 448,427,290,506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఉదంతాన్ని వివిధ ఉద్యోగ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలన్న ఉద్యోగ సంఘాలు.... లేకుంటే ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తం చేస్తామని హెచ్చరించారు.