నెల్లూరు జిల్లా కందమూరుకు చెందిన ఎస్సీ యువకుడు ఉదయగిరి నారాయణ (38) అనుమానాస్పద మృతిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అతడిని తీవ్రంగా కొట్టి.. చిత్రహింసలకు గురి చేసి చంపేశారని, ఆ హత్యోదంతం వెలుగు చూడకుండా ఉండేందుకే ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి తొలి నుంచీ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు వీటికి మరింత బలం చేకూర్చేలా ఉంది. బాధ్యుడైన ఎస్సైని కాపాడేందుకు పోలీసు ఉన్నతాధికారులపై జిల్లా మంత్రి ఒత్తిడి తెచ్చి ఈ వ్యవహారమంతా నడిపించారని ప్రతిపక్ష తెదేపా ఆరోపిస్తోంది.
చంపేశారని ఆరోపిస్తే..
*తన భర్తది ఆత్మహత్య కాదని.... పొదలకూరు ఎస్సై కరీముల్లా, ఇటుకల కర్మాగారం యజమాని వంశీనాయుడు కలిసి కొట్టి చంపేశారని, ఆ తర్వాత మృతదేహాన్ని ఉరికి వేలాడదీశారని మృతుడి భార్య పద్మావతి ఆరోపించినా పోలీసులు పరిగణనలోకి తీసుకోలేదు. నారాయణది ఆత్మహత్యగానే పేర్కొంటూ సీఆర్‌పీసీ 174 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
*ఆ తర్వాత.. ఇటుకల కర్మాగారం యజమాని వంశీ నాయుడు అతన్ని ఆత్మహత్యకు పురికొల్పాడని, ఇంట్లోకి అక్రమంగా చొరబడ్డాడని పేర్కొంటూ సెక్షన్లు మార్చారు.
*జూన్ 19న మృతి చెందితే 21 వరకూ పోస్టుమార్టం నిర్వహించలేదు. తెదేపా సహా ప్రతిపక్ష పార్టీలు, ఎస్సీ సంఘాల నాయకుల ఆందోళన తర్వాతే చేశారు.
*నారాయణ మర్మాంగాలు, ఛాతీపై ఉన్న గాయాల విషయాల్ని పోస్టుమార్టం నివేదికలో ప్రస్తావించలేదు.