నెల్లూరులో ప్రముఖ వైద్యుడు కరోనా అనుమానిత లక్షణాలతో ఈ నెల 3న నగరంలోని జీజీహెచ్‌లో చేరారు. వైద్యులు పరీక్షించి కరోనా పాజిటివ్ అని తేల్చారు. జీజీహెచ్‌లో చికిత్సపరంగా సమస్యలున్నాయంటూ ఆయన కుటుంబసభ్యులు వైద్యుణ్ని 6వ తేదీన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడే ఐసొలేషన్ వార్డులో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. మూడు రోజులుగా ఆరోగ్యం విషమించింది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కూడా ఉండటంతో ఆయన కరోనాకు బలయ్యారు. ఆయనకు వైరస్ ఎలా సోకిందన్న దానిపై ఇప్పటికీ స్పష్టత రాలేదు.
కరోనా బారిన పడిన సదరు వైద్యుడు వెంటనే అప్రమత్తం కాలేదు. లక్షణాలు బయటపడినా నగరంలో ఆయన ఓ ఆసుపత్రిని ప్రారంభించడం.. ఆ కార్యక్రమానికి పలువురిని ఆహ్వానించడం మరింత ఇబ్బందిగా మారింది. వైద్యుడికి పాజిటివ్ నిర్ధారణ అయిన వెంటనే అధికారులు అప్రమత్తమై ఆయనతో కాంటాక్ట్ ఉన్న సుమారు 80 మందిని క్వారంటైన్‌కు తరలించారు. వారి నమూనాలను పరీక్షించగా వైద్యుని భార్యతో పాటు ఆయన వద్ద పనిచేసే టెక్నీషియన్‌కు పాజిటివ్ వచ్చింది. వారిని ఐసొలేషన్‌కు తరలించారు.