అమ్మఒడి రెండో విడత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 11న నెల్లూరులో ప్రారంభించనున్నారు. వర్షం కురిసే అవకాశమున్నందున ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రులు అనిల్‌కుమార్, మేకపాటి గౌతంరెడ్డి అధికారులకు సూచించారు.
నెల్లూరు జిల్లాలో సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన మంత్రులు - నెల్లూరు జిల్లాలో సీఎం పర్యటన
అమ్మఒడి రెండో విడత ప్రారంభోత్సవ సందర్భంగా నెల్లూరు జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు. ఈ క్రమంలో జిల్లా మంత్రులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. వర్షం కురిసే అవకాశం ఉన్న పరిస్థితుల్లో నగరంలోని మినీ బై పాస్ దగ్గర వేణుగోపాలస్వామి గ్రౌండ్ వద్ద సీఎం భారీ బహిరంగ సభకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని జిల్లా అధికారులను మంత్రులు ఆదేశించారు.

గురువారం నెల్లూరు నగరంలోని వేణుగోపాలస్వామి కళాశాల మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. నగరంలో ట్రాఫిక్ సమస్య లేకుండా ప్రణాళికలను మ్యాప్ ద్వారా పరిశీలించారు. అనంతరం మేకపాటి గౌతంరెడ్డి క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. కార్యక్రమంలో కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు, జాయింట్ కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి, కార్పొరేషన్ కమిషనర్ దినేష్‌కుమార్ పాల్గొన్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ తన క్యాంపు కార్యాలయంలోనూ జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు.