రైతులకు పెట్టుబడి సాయం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన రైతుభరోసా పథకం నేడు ప్రారంభం కానుంది. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకుటూరు గ్రామం పరిధిలోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో జరిగే కార్యక్రమంలో సీఎం జగన్ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు కేంద్ర నిధులను వినియోగిస్తున్నందున ఈ పథకానికి ‘‘ వైఎస్సార్ రైతుభరోసా- పీఎం కిసాన్’ గా పేరు పెట్టారు.
వెయ్యి పెంపు
వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబుతో సహా జిల్లా మంత్రులు, ప్రజా ప్రతినిధులు సహా ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అర్హత కల్గిన రైతులకు ఏడాదికి రూ.12 వేల 500 రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించినా ...రైతు సంఘాల ప్రతినిధుల విజ్ఞప్తి దృష్ట్యా సాయాన్ని ప్రభుత్వం మరో వెయ్యి పెంచింది. ప్రతి రైతుకు ఏటా 13 వేల 500 రూపాయలు చొప్పున ఐదేళ్ల పాటు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు. 5 ఏళ్లలో 50 వేలు ఇస్తామన్న ప్రభుత్వం పెరిగిన మొత్తంతో 67 వేల 500 రూపాయలు రైతులకు అందివ్వనుంది. మే నెలలో 7 వేల 500, అక్టోబర్ నెలలో రబీ కోసం 4000, సంక్రాంతికి 2 వేల రూపాయలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని జిల్లాల్లో అర్హులైన రైతులు, కౌలు రైతులకు ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు రైతు భరోసా మొత్తాన్ని రైతులకు అందించనున్నారు.
అర్హుల జాబితా సచివాలయాల్లో
రాష్ట్ర వ్యాప్తంగా 51 లక్షల మంది రైతులతో సహా, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు చెందిన మరో 3 లక్షలమందికి ఈ పథకం వర్తింపజేయనున్నారు. అర్హుల జాబితాను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శనకు పెట్టారు. వెబ్‌ల్యాండ్‌లో ఉన్న రికార్డుల ఆధారంగా జాబితా రూపొందించారు. రైతు మరణిస్తే ఆయన భార్యకు భరోసా మొత్తాన్ని అందజేస్తారు. ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాలను సడలించాలన్న సీఎం ఆదేశాలతో అధికారులు తగు చర్యలు తీసుకోనున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అర్హులైన వారికి రైతుభరోసా ఇవ్వాలని, సంతృప్తికర స్థాయిలో పథకాన్ని వర్తింపు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. దీని కోసం నవంబరు 15 వరకూ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.