మాజీ మంత్రి దేవినేని ఉమాపై బోగస్ కేసు నమోదు చేశారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆయన సోమవారం నెల్లూరు జిల్లా వెంకటగిరిలో పర్యటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. 'జగన్‌పై ఉన్నవన్నీ నిజమైన కేసులే. తప్పుడు కేసులకు తెదేపా ఎప్పుడూ భయపడదు. తెదేపా ఉండదని వదంతులు సృష్టిస్తున్నారు. తెలుగు జాతి ఉన్నంతకాలం తెదేపా ఉంటుంది. పేదలు, బడుగుల కోసం ఎన్టీఆర్ పెట్టిన పార్టీ తెలుగుదేశం. తిరుపతిలో తెదేపా గెలిస్తేనే జగన్ అరాచకాలు తగ్గుతాయి' అని అన్నారు.
తెదేపా హయాంలోని నరేగా బిల్లులు ఇప్పటికీ చెల్లించకపోవడం దారుణమని చంద్రబాబు మండిపడ్డారు. బకాయిలు చెల్లించే వరకు న్యాయబద్ధంగా పోరాడతామని స్పష్టం చేశారు. ఇకపై కార్యకర్తల కోసం ఎక్కువ సమయం కేటాయిస్తా అని అన్నారు.