రుణాల పేరుతో కెనరా బ్యాంకును మోసం చేశారన్న అభియోగంపై నెల్లూరులోని శాంతిలాల్ అండ్ సన్స్ జ్యువెలరీస్పై సీబీఐ కేసు నమోదైంది. కెనరా బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. చెన్నైలోని సీబీఐ ఆర్థిక నేరాల విభాగం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. నగల దుకాణం యజమాని శాంతిలాల్ తో పాటు.. ఆయన కుటుంబ సభ్యులు సాంత్రి భాయ్, కమలేష్ కుమార్, శంకర్ లాల్పై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది.
నెల్లూరులోని నగల దుకాణంపై సీబీఐ కేసు - cbi case on jewelry shop in nellore news
కెనరా బ్యాంకు నుంచి 70 కోట్ల రూపాయలు రుణం తీసుకుని తిరిగి చెల్లించకుండా మోసం చేశారన్న అభియోగంపై నెల్లూరులోని ఓ నగదు దుకాణంపై సీబీఐ కేసు నమోదైంది. ఆ దుకాణ యజమాని సహా అతని కుటుంబ సభ్యుల ఇళ్లల్లోనూ చెన్నైలోని సీబీఐ ఆర్థిక నేరాల విభాగం సోదాలు నిర్వహించినట్లు సమాచారం.
నెల్లూరులోని శాంతిలాల్ అండ్ జ్యువెలరీస్, శాంతికళ జ్యువెలరీస్ కలిపి 70 కోట్ల రూపాయల రుణం తీసుకున్నట్లు కెనరా బ్యాంకు సీబీఐకి తెలిపింది. ఆ తర్వాత దుకాణం మరమ్మతుల పేరిట నగలన్నీ అమ్మేసి.. రుణం చెల్లించలేమని తెలిపిందన్నారు. రుణాన్ని ఇతర అవసరాలకు మళ్లించి మోసానికి పాల్పడినట్లు బ్యాంకు అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో కొందరు బ్యాంకు సిబ్బంది ప్రమేయం కూడా ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. దర్యాప్తు చేపట్టిన చెన్నైలోని సీబీఐ ఆర్థిక నేరాల విభాగం.. శంకర్ లాల్, ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.