Azadi Ka Amrit Mahotsav: పొట్టి శ్రీరాములు పూర్వీకులు పూర్వ నెల్లూరు జిల్లా కనిగిరి ప్రాంతంలోని పడమటిపల్లి (ప్రస్తుతం ప్రకాశం జిల్లా)కి చెందినవారు. తండ్రి హయాంలో మద్రాసుకు వెళ్లారు. 1901 మార్చి 16న అక్కడే జన్మించిన శ్రీరాములు చిన్నప్పటి నుంచే ఏకసంథాగ్రాహి. పాఠశాలలో షేక్స్‌పియర్ నాటకాలు వేసిన ఆయన బ్యాడ్మింటన్, బిలియర్డ్స్ ఆటల్లోనూ దిట్ట. 1924లో బొంబాయిలో శానిటరీ ఇంజినీరింగ్ కోర్సు పూర్తి చేసిన ఆయన్ను సహచరులంతా పి.ఎస్.గుప్తా అని పిలిచేవారు. ఆ కాలంలోనే నెలకు రూ.250 జీతం సంపాదించిన శ్రీరాములు జీవితం అనూహ్య మలుపులకు లోనైంది. మేనరిక సంబంధం సీతమ్మతో పెళ్లయింది. జన్మించిన ఐదు రోజులకే పిల్లవాడు చనిపోగా... ఆరు నెలల్లో భార్య... మరికొద్ది రోజుల్లో శ్రీరాములు తల్లి కన్నుమూశారు. వరుస మరణాలతో ఆయనను వైరాగ్యం ఆవహించింది. 30 ఏళ్ల వయసులోనే ఉద్యోగానికి రాజీనామా చేసి.. సబర్మతి ఆశ్రమానికి చేరుకున్నారు. ఆశ్రమవాసులకు కేటాయించిన రూ.12 నెలసరి భత్యంలో రూ.6 మిగిల్చి ఆశ్రమానికే తిరిగి ఇచ్చేవారు. సబర్మతిలో ఉన్నప్పుడు శ్రీరాములు వ్యక్తిగత సత్యాగ్రహంలో పాల్గొని మూడుసార్లు జైలుకు వెళ్లారు. 1939లో కృష్ణాజిల్లా కొమరవోలు గాంధీ ఆశ్రమానికి వచ్చారు. ఎక్కడికి వెళ్లినా వెంట చరఖా, చేతి సంచిలో ఏకులు, పత్తి, రెండుజతల దుస్తులుండేవి. పార్టీలకు దూరంగా ఉంటూ జాతీయోద్యమంలో పాల్గొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో జైలుకెళ్లి వచ్చాక నెల్లూరును నివాసంగా మార్చుకున్నారు.
మెడలో వేసుకొని ప్రచారం
దక్షిణ భారత హిందీ ప్రచార సభ సమావేశానికి గాంధీజీ ఒకసారి మద్రాసుకు వచ్చారు. అదే సభలో శ్రీరాములు హరిజనోద్ధరణ నినాదాలు రాసిన అట్టలు మెడలో వేసుకొని తిరుగుతూ ప్రచారం చేశారు. గాంధీజీని కలవటానికి వేదిక వద్దకు వెళ్లబోతే నిర్వాహకులు తెలియక ఆయన్ను అడ్డగించారు. ఇది చూసిన గాంధీజీ వెంటనే... శ్రీరాములును పేరుపెట్టి పిలిచారు. నిర్వాహకులతో .. ‘‘మీరు తెలుగువారై ఉండీ.. పొట్టి శ్రీరాముల్ని తెలుసుకోలేక పోయారా? ఈయన సామాన్యుడు కాదు. ఇలాంటి పదిమంది వెంట ఉంటే సంవత్సరం లోపే స్వరాజ్యం సాధించగలం’’ అన్నారు.
దేవాలయంలోకి హరిజనులకు ప్రవేశం కల్పించాలంటూ నిరసనలు
ఆంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ నిరాహారదీక్ష చేపట్టకముందే శ్రీరాములు అనేకసార్లు నిరశనకు దిగారు. ఇవన్నీ అంటరానితనం నిర్మూలన కోసం చేసినవే. నెల్లూరు వేణుగోపాల స్వామి దేవాలయంలోకి హరిజనులకు ప్రవేశం కల్పించాలంటూ.. 1946 మార్చిలో తొలిసారి ఉపవాస దీక్షకు కూర్చున్నారు. అయితే అప్పటి కాంగ్రెస్ నాయకులు గాంధీజీని ఆహ్వానించి అట్టహాసంగా ప్రచారం చేసి ఈ ప్రవేశ కార్యక్రమం చేయాలనుకున్నారు. కానీ గాంధీజీకి వీలుపడక మీరే చేయండని లేఖ రాశారు. కానీ గాంధీజీ రాకుంటే తమకు ప్రచారం రాదని కాంగ్రెస్ నాయకులు దీన్ని వాయిదా వేస్తూ వచ్చారు. దీన్ని నిరసిస్తూ పొట్టి శ్రీరాములు నిరాహార దీక్షకు కూర్చున్నారు. గాంధీజీ సైతం ఇందుకు మద్దతిచ్చారు. పదిరోజుల పాటు ఈ దీక్ష సాగింది. దీంతో ఆలయ ధర్మకర్తలు, కాంగ్రెస్ నేతల్లో ఆందోళన మొదలైంది. వారు గాంధీజీ ద్వారా శ్రీరాములును ఒప్పించేందుకు ప్రయత్నించారు. కానీ గాంధీజీ అందుకు నిరాకరించారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆలయ ధర్మకర్తలు సమావేశమై హరిజనులకు దేవాలయ ప్రవేశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. అదే ఏడాది డిసెంబరులో 19 రోజులు దీక్ష చేసి నెల్లూరులోని అన్ని దేవాలయాల్లోనూ దళితులకు ప్రవేశం కల్పించేలా చేశారు శ్రీరాములు.
ప్రభుత్వాన్ని వణికించిన ఉపవాస దీక్ష
1949లో ఆయన చేసిన 28 రోజుల ఉపవాసదీక్ష మద్రాసు రాష్ట్ర ప్రభుత్వాన్ని వణికించింది. ప్రతినెలా ఒకరోజును హరిజన దినంగా ప్రకటించాలని... ఆరోజు ప్రజలంతా దళితజనోద్ధరణ సేవలో ఉండాలని డిమాండ్ చేస్తూ.. 1949 జనవరి 12న వార్ధాలోని గాంధీ సేవాశ్రమంలో శ్రీరాములు ఈ నిరాహారదీక్ష మొదలెట్టారు. బాబూ రాజేంద్రప్రసాద్, ఎన్.జి.రంగా, వినోబా భావేలాంటివారు చెప్పినా ఆయన విరమించలేదు. చివరకు మద్రాసు ముఖ్యమంత్రి ఒ.పి.రామస్వామి రెడ్డియార్ ప్రతినెలా 30వ తేదీని హరిజన దినంగా ప్రకటించక తప్పలేదు. స్వాతంత్య్రానంతరం గాంధీజీ చెప్పిన నిర్మాణ కార్యక్రమాలు తెలుగునాట సక్రమంగా సాగాలంటే ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం అవసరం అని శ్రీరాములు మరోసారి ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఏకంగా 58 రోజులు నిరాహారంగా పోరాడి 1952 డిసెంబరు 15న కన్నుమూసిన ఈ అమరవీరుడు ఈసారి మాత్రం తన మరణానంతరం లక్ష్యాన్ని సాధించారు.
ఇదీ చదవండి:
vaccination : నేటి నుంచి 12-14 ఏళ్ల పిల్లలకు కొవిడ్ టీకా పంపిణీ