యువత ఉద్యోగాలు చేయడమే కాకుండా.. ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదిగినప్పుడే అభివృద్ధి సాధించినట్లు అవుతుందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. నెల్లూరు నగరంలోని ఐటీఐ కళాశాల ఆవరణలో జరిగిన జాతీయ అప్రెంటిస్షిప్ మేళాలో మంత్రి అనిల్, గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలని మంత్రి గౌతమ్ రెడ్డి పిలుపునిచ్చారు. పోటీ ప్రపంచంలో విజయం సాధించాలంటే నైపుణ్యాభివృద్ధి అవసరముందన్నారు. ఇందుకోసం ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి సెంటర్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తోందన్నారు. ఐటీఐ, పాలిటెక్నిక్లలోనూ నూతన సబ్జెక్టులను తీసుకురానున్నట్లు వెల్లడించారు. ప్రస్తుత ఎలక్ట్రానిక్ యుగానికి తగినట్లే ఈ కోర్సులు ప్రవేశపెడతామని తెలిపారు. రాబోయే రోజుల్లో యువత ఏ ఉద్యోగానికైనా అర్హత సాధించేలా వారిలో నైపుణ్యాన్ని పెంపొందిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నైపుణ్య కళాశాలలను తీసుకురావడంతోపాటూ, నెల్లూరు ఐటీఐ కళాశాలలో స్కిల్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.
స్థానిక యువతకే 75 శాతం ఉద్యోగాలు కల్పించాలని ముఖ్యమంత్రి జగన్ చట్టం తీసుకువచ్చారని మంత్రి అనిల్ తెలిపారు. అయితే సరైన నైపుణ్యం లేని కారణంగా పరిశ్రమల వారు ఇతర ప్రాంతాల నుంచి ఉద్యోగులను తీసుకొచ్చుకుంటున్నారని చెప్పారు. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి సెంటర్లను ఏర్పాటు చేస్తోందన్నారు.