నెల్లూరులో కొనసాగుతున్న రాజధాని రైతుల మహా పాదయాత్ర అమరావతి రైతుల మహా పాదయాత్ర 21వ రోజుకు (21st day Farmers Padayatra) చేరుకుంది. ప్రకాశం జిల్లాలో ముగిసిన యాత్ర.. నెల్లూరు జిల్లాలో ప్రవేశించింది. జిల్లాలో నేడు రాజువారి చింతలపాలెం నుంచి ప్రారంభమైన యాత్ర.. కావలిలో ముగియనుంది. రైతులు అక్కడే బస చేయనున్నారు. ఇవాళ 15 కిలోమీటర్ల మేర రైతుల పాదయాత్ర కొనసాగనుంది. నెల్లూరు జిల్లాలో మొత్తం 16 రోజులపాటు అమరావతి పాదయాత్ర కొనసాగనుంది. ఈ రైతు మహా పాదయాత్రకు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు. అడుగడుగునా పూలవర్షం కురిపిస్తూ.. ఘనస్వాగతం పలుకుతున్నారు.
అమరావతి రైతుల పాదయాత్రకు భాజపా నేతలు తరలివచ్చి మద్దతు తెలిపారు. అమరావతిలోనే రాష్ట్ర భాజపా కార్యాలయం కడుతున్నామనేది.. అమరాతే ఏకైక రాజధానిగా ఉండాలన్న నిర్ణయానికి నిదర్శనమన్నారు. కేంద్రం నిధులతో అమరావతిలో అనేక పనులు చేపట్టామని భాజపా నేతలు తెలిపారు. భాజపా నేతలు పురందేశ్వరి, సోమువీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, సుజనా చౌదరి, సీఎం రమేశ్, కామినేని శ్రీనివాస్ తదితరులు పాదయాత్రకు మద్దతు తెలిపారు.
రాజధాని రైతులకు భాజపా నేతల మద్దతు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో చర్చించాం..
అమరావతిలో రాజధాని కొనసాగాలని రెండేళ్ల కిందటే నిర్ణయం తీసుకున్నామని, తాజాగా తిరుపతిలో ఇదే విషయంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో చర్చించామని పురందేశ్వరి తెలిపారు.. రైతులపై లాఠీఛార్జీ దుర్మార్గమన్నారు. రాయలసీమలోకి రైతులను రానీయబోమంటున్నట్లు తెలిసిందని, రైతులకు అండగా భాజపా శ్రేణులు వస్తారని భరోసా ఇచ్చారు. అమరావతికి భాజపా సంపూర్ణ మద్దతు తెలుపుతోందని సోము వీర్రాజు తెలిపారు. పార్టీ కార్యాలయం కూడా అక్కడే ఏర్పాటు చేస్తామన్నారు. ఉత్తరాంధ్రలోనూ పాదయాత్రకు మద్దతు అందిస్తామన్నారు. ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ రాష్ట్రానికి అమరావతి ఒక్కటే రాజధాని అని, ముఖ్యమంత్రులు మారొచ్చు కానీ, రాజధాని మారదన్నారు. హైకోర్టు బెంచ్ ఎక్కడైనా పెట్టుకోవచ్చని, అమరావతి నుంచి హైకోర్టును మార్చే ప్రసక్తే లేదన్నారు. రెండున్నరేళ్లుగా పోలీసులు ఇష్టమొచ్చినట్లు వ్యవహరించారని, వారి ఆటలు ఇక సాగవన్నారు. మరో ఎంపీ సుజనాచౌదరి మాట్లాడుతూ రాజధాని అమరావతి రాష్ట్రంలోని 13 జిల్లాలదన్నారు. రైతులకు న్యాయం ఆలస్యం కావచ్చు కానీ ఒక్క రూపాయి కూడా నష్టం వాటిల్లదని భరోసా ఇచ్చారు. పాదయాత్ర దేవస్థానం చేరేలోపే సీఎం జగన్ మెడలు వంచైనా రాజధానిపై ప్రకటన చేయిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రైతులు చేస్తున్న ఉద్యమాన్ని ప్రజలు మర్చిపోరన్నారు. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ 6 నెలల్లో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటానని చెప్పిన జగన్ ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంసానికి పాల్పడ్డారన్నారు. రైతుల పాదయాత్రకు వెళుతున్నానని తెలిసి ముగ్గురు కుటుంబసభ్యులు రూ.15లక్షలు ఇచ్చారంటూ ఆ మొత్తాన్ని ఐకాస నేతలకు అందజేశారు. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ జగన్‌రెడ్డి విశాఖలో భూములు కబ్జా చేశారన్నారు. న్యాయపరంగానే అమరావతిని సాధించి తీరుతామని చెప్పారు.
ఇవీ చదవండి :