రాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటుతో పరిపాలన సౌలభ్యం ఉంటుందని కర్నూలు ఎమ్మెల్యే హాఫీస్‌ఖాన్ అన్నారు. నూతన జిల్లాల ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతతో కర్నూలు మెడికల్ కళాశాల నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. గతంలో కర్నూలు రావాలంటే 150కిలోమీటర్లు దూరం ప్రయాణించాల్సి వచ్చేదని, ఇప్పుడు 75 కిలో మీటర్లకు తగ్గిందని ఆనందం వ్యక్తం చేశారు.
చిన్న అపశ్రుతి: ప్రకాశం జిల్లా కనిగిరిలో ఏర్పాటుచేసిన రెవెన్యూ డివిజన్ కార్యాలయ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ సహా వైకాపా నాయకులు వెళుతుండగా... చిన్న అపశ్రుతి జరిగింది. మినీ లారీలో కనిగిరి వీధుల్లో ర్యాలీ చేస్తుండగా.. వాహనానికి కట్టిన బారికేడ్లు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఎమ్మెల్యే సహా వైకాపా నాయకులు ముందుకు ఒరిగారు. అయితే వాహన క్యాబిన్ అడ్డుగా ఉండటం వల్ల ప్రమాదం తప్పింది. అపరిమిత సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు లారీ ఎక్కడం వల్లే బారికేడ్లు విరిగిపోయాయి.