ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నత్తనడకన అవుకు, వెలిగొండ టన్నెల్‌ పనులు.. గడువులోగా పూర్తవటం కష్టమే..!

Veligonda and Avuku tunnel works: ముఖ్యమంత్రి సొంత జిల్లాకు నీటిని తీసుకెళ్లే సొరంగం పనులే నత్తనడకన సాగుతున్నాయి. బిల్లుల చెల్లింపులో జాప్యం, గుత్తేదారు అలసత్వం వెరసి క్షేత్రస్థాయిలో పనులు ముందుకు సాగడం లేదు. 2022 ఆగస్టులో వెలిగొండ నుంచి నీళ్లు ఇస్తామని మరోసారి ముఖ్యమంత్రి చెప్పారు. వాస్తవానికి రెండు నెలల్లో ఇది సాధ్యమయ్యే పరిస్థితి లేదు.

veligonda and avuku tunnel works are still in pending
నత్తనడకన అవుకు, వెలిగొండ టన్నెల్‌ పనులు

By

Published : Jun 13, 2022, 7:13 AM IST

Slow works: వైఎస్​ఆర్ జిల్లాకు నీటిని తీసుకెళ్లే సొరంగం పనులు నత్తనడకన సాగుతున్నాయి. బిల్లుల చెల్లింపులో జాప్యం, గుత్తేదారు అలసత్వం వెరసి క్షేత్రస్థాయిలో పనులు ముందుకు సాగడం లేదు. ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి వైఎస్సార్​ కడప జిల్లా గండికోటకు వరద జలాల తరలింపు లక్ష్యంగా పెట్టుకున్నారు. అవుకు వద్ద రెండు సొరంగాలు ఏర్పాటు చేసి 20 వేల క్యూసెక్కుల నీటిని గండికోటకు మళ్లించేలా ప్రణాళిక చేశారు.

శ్రీశైలం వెనుక జలాలను వెలిగొండ సొరంగాల ద్వారా నల్లమల సాగర్‌కు 43.5 టీఎంసీలు తరలించి అక్కడి నుంచి ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు, వైఎస్సార్​ కడప జిల్లాల్లోని 30 మండలాల్లో 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలన్నది లక్ష్యం. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే వెలిగొండ నుంచి నీళ్లు ఇస్తామని 2019 ఎన్నికలకు ముందు జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. మూడేళ్లు గడుస్తున్నా ప్రగతి శూన్యమే. 2022 ఆగస్టులో వెలిగొండ నుంచి నీళ్లు ఇస్తామని మరోసారి ముఖ్యమంత్రి చెప్పారు. వాస్తవానికి రెండు నెలల్లో ఇది సాధ్యమయ్యే పరిస్థితి లేదు.

అప్పుడు పూర్తిచేయడంతో ఆ మాత్రమైనా..గాలేరు-నగరి ప్రాజెక్టు ప్యాకేజీ-30 కింద అవుకు రెండు సొరంగాల పనులకు శ్రీకారం చుట్టారు. 5.75 కి.మీ.పొడవు, 11 మీటర్ల వ్యాసంతో తవ్వడం ప్రారంభించారు. ఎడమ సొరంగంలో 380 మీటర్లు, కుడి సొరంగంలో 160 మీ. ఫాల్ట్‌జోన్‌(మట్టి పొరలు ఊడిపడుతున్న ప్రాంతం) వచ్చింది. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎడమ సొరంగం ఫాల్ట్‌జోన్‌ వద్ద రెండు మళ్లింపు సొరంగాలకు డిజైన్‌ చేసి 2018లో పూర్తి చేసింది.

అనంతరం అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం అసంపూర్తిగా ఉన్న అవుకు కుడి సొరంగం ఏడాదిలోగా పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ప్రాజెక్టుల్లో పెట్టింది. 160 మీటర్ల ఫాల్ట్‌ జోన్‌ తవ్వకం, 2.50 కిమీ లైనింగ్‌ పనులకు రూ.108 కోట్లతో గుత్తేదారుకు పనులు అప్పగించింది. ఈ మూడేళ్లలో ఇప్పటివరకు కేవలం 80 మీటర్లు మాత్రమే సొరంగం పనులు చేశారు. తెదేపా ప్రభుత్వం ఎడమ సొరంగం పూర్తి చేయడంతో 10వేల క్యూసెక్కులైనా గండికోటకు వెళుతున్నాయి.

ఏళ్లు గడుస్తున్నా నీళ్లేవి?:ప్రకాశం జిల్లా దోర్నాల మండలం కొత్తూరు నుంచి కొల్లంవాగు వరకు 18.8 కి.మీటర్లు మొదటి సొరంగం తవ్వకం పనులు రూ.776 కోట్లతో 2008లో చేపట్టారు. సకాలంలో నిధులు మంజూరుకాకపోవడం, యంత్రం బురదలో కూరుకుపోవడం, గట్టిరాయి చోట పనులు నెమ్మదించడంతో 13 ఏళ్లు పట్టింది. సొరంగ నిర్మాణం పూర్తైనా మనుషులు తవ్విన కిలోమీటరు మేర లైనింగ్‌ పనులు పెండింగ్‌లో ఉన్నాయి.

సుమారు రూ.735 కోట్లతో 2009 జూన్‌లో రెండో సొరంగం పనులు ప్రారంభించారు. ప్రస్తుతం అంచనా వ్యయం రూ.1,155 కోట్లకు చేరింది. 12 ఏళ్లు దాటినా ఇంకా పనులు సాగుతూనే ఉన్నాయి. యంత్రం మొరాయించడంతో మరమ్మతులు చేయించాల్సి ఉండగా నిబంధనలను పక్కకు తోసి మనుషులతో తవ్విస్తున్నారు.

త్వరితగతిన పూర్తి చేస్తేనే..:అవుకు టన్నెల్‌ కుడి సొరంగం 160 మీటర్ల ఫాల్ట్‌జోన్‌కుగాను.. 84 మీటర్ల వరకు గుత్తేదారు మూడేళ్లలో తవ్వారు. బిల్లుల చెల్లింపులో జాప్యం కావడంతో గుత్తేదారు పనులు నిలిపేశారు. ఇంజినీర్ల ఒత్తిడితో పనులు చేసేందుకు గుత్తేదారు ఒప్పుకున్నా నత్తనడకన సాగుతున్నాయి. బకాయిలు చెల్లించకపోవడంతో వెలిగొండ రెండో సొరంగం పనులకు విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. రూ.63.49 కోట్లు చెల్లిస్తామని ప్రాజెక్టు అధికారులు చెప్పడంతో సరఫరా పునరుద్ధరించారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details