కడప జిల్లా బద్వేలులోని లక్ష్మిపాలెం ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో వరుణ యాగం జరిగింది. వెంకటేశ్వర స్వామి మూలవిరాట్టు విగ్రహానికి 108 బిందెలతో వేద మంత్రోచ్ఛరణల మధ్య అభిషేక పూజలు జరిగాయి. అర్చక స్వాములు విరాటపర్వం పారాయణం చేశారు. వర్షం కోసం ప్రత్యేకంగా వరుణ జపం జరిపించారు. బద్వేలు వాసులంతా పెద్దఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వరుణుడి కరుణ కోసం.. వరుణ యాగాలు
వర్షాకాలం వచ్చినా.. రాష్ట్రంలో వర్షాల జాడ కనిపించడం లేదు. దీంతో ప్రజలు వరుణ యాగం జరుపుతున్నారు. వర్షాలు విస్తారంగా కురిసి పంటలు సక్రమంగా పండాలని కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ప్రజలు వరుణయాగం చేస్తున్నారు.
వర్షాలు కురవాలని కర్నూలు జిల్లాలో వరుణ యాగం నిర్వహించారు. నగరంలోని హరిహర క్షేత్రంలో బ్రాహ్మణ సంఘం, ఫర్టిలైజర్స్ యాజమాన్య సంఘం సంయుక్త ఆధ్వర్యంలో శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు, నగరవాసులు పెద్ద ఎత్తున తుంగభద్ర జలాలు తీసుకువచ్చి శివునికి అభిషేకం చేశారు. అనంతరం హోమం నిర్వహించారు. వర్షాలు కురిసి పంటలు పండాలని కోరుకున్నారు.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలో వర్షం కోసం రైతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని కోట వీధిలో ఉన్న బొడ్రాయికి నూటొక్క బిందెలతో నీరుతో అభిషేకం చేశారు. ఇలా చేస్తే వర్షాలు పడతాయని రైతుల ఆశ.