కర్నూలు జిల్లాలో పుష్కరాలకు సంబంధించి 8 నియోజకవర్గాలకు నిధులు మంజూరు అయ్యాయి. పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో 56 పనులు రూ.30 కోట్లు, ఆర్ అండ్ బీ శాఖ పరిధిలో 36 పనులకు రూ.126 కోట్లు కేటాయించారు. పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో సీసీ, తారు రోడ్ల పనులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఒక్కరోడ్డు పూర్తి కాలేదు. మరోవైపు ఆర్‌అండ్‌బీ శాఖ కర్నూలు నగరంలో రాత్రి సమయాల్లో పనులు చేస్తున్నారు. గ్రామీణ, తుంగభద్ర పరివాహక ప్రాంతాల్లో పనులు నత్తనడకన సాగుతున్నాయి. తుంగభద్ర నది పరిధిలో అధిక వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను ముందుగా మరమ్మతులు చేసి అందుబాటులోకి తేవాలని భావించినా.. ఆచరణలో అమలు కావడం లేదు. పనులను బట్టి గుత్తేదార్లకు సమయం ఇచ్చారు. కాంట్రాక్టు దక్కించుకున్న వారిలో కడప, నెల్లూరు, విజయవాడ, స్థానిక గుత్తేదారులు ఉన్నారు.
రహదారుల పనులు పూర్తి చేయడానికి జిల్లా కలెక్టర్ ఇచ్చిన గడువు ఈ నెల 15 వరకే. క్షేత్రస్థాయిలో పనులు చూస్తే పుష్కరాలకు రోడ్లు అందుబాటులోకి వచ్చేలా లేవు. ఒకవేళ రోడ్లు పూర్తి చేయకపోతే ట్రాఫిక్ సమస్య వేధించే అవకాశాలున్నాయి. నందికొట్కూరు మండలం నాగటూరు గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.60 లక్షలు మంజూరు కాగా, ఇంకా పనులు ప్రారంభం కాలేదు. మిడుతూరు మండలం చెరుకుచెర్ల బాట నుంచి పారుమంచాల వరకు ఉన్న పాత బీటీ రోడ్డును తవ్వి రోలింగ్ చేసి వదిలిపెట్టారు. జూపాడుబంగ్లా మండల పరిధిలో తరిగోపుల రహదారి గుంతల మయంగా మారింది. పుష్కర నిధులు రూ.80 లక్షలతో నూతన రహదారి వేయాల్సి ఉన్నా ఇంత వరకు ప్రారంభమే కాలేదు. గూడూరు-పెంచికలపాడు రోడ్డు ప్రస్తుతం ఒకవైపు రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఇంకా తారు పనులు మొదలు పెట్టలేదు.