ఆరుగాలం కష్టించి పండించినా.. కనీసం రవాణా ఛార్జీలకూ డబ్బులు సరిపోవడం లేదు. వేలరూపాయలు పెట్టుబడి పెట్టినా లాభం లేకపోగా...టమోటా రైతులకు నష్టమే మిగులుతోంది. కర్నూలు జిల్లా పత్తికొండలో రైతుల పరిస్థితి అధ్వానంగా మారింది. పత్తికొండ మార్కెట్ రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందింది. నిన్నమొన్నటి వరకు రైతులతో కళకళలాడిన మార్కెట్.. ఇప్పుడు ఎవరూ లేక వెలవెలబోతోంది. ఎకరాకు 40నుంచి 50వేల దాకా రైతులు పెట్టుబడి పెట్టారు. కొద్దిరోజుల వరకూ కిలో టమోటా 7నుంచి 8రూపాయల వరకూ పలికింది. మూడు రోజులుగా కిలో టమోటా రూపాయి కూడా పలకడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.
పత్తికొండ మార్కెట్ నుంచి ఎక్కువగా తెలంగాణ, చెన్నైకు టమోటా ఎగుమతి చేస్తారు. కొన్ని రోజుల క్రితం తెలంగాణాలో టమోటా మార్కెట్ ప్రారంభమవ్వడంతో పత్తికొండవైపు వ్యాపారులు చూడటం లేదు. మదనపల్లి మార్కెట్ కూడా ఆరంభం కావటం వల్ల...అక్కడి నుంచి చెన్నైకి టమోటాలు ఎగుమతి చేస్తున్నారు. పత్తికొండలో ధరలు పతనమవ్వడానికి ఇవే కారణం కావొచ్చని రైతులు చెబుతున్నారు. కనీసం కూలీలకు చెల్లించేందుకు కూడా డబ్బులు రావటం లేదని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. గిట్టుబాటు ధర కల్పించే చర్యలు చేపట్టి.. ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.