గుంటూరు జిల్లా తుళ్లూరులో గ్రామ వాలంటీర్ గోపి నాయక్ ఆత్మహత్య చేసుకున్నాడు. తుళ్లూరు వైన్ షాప్ సమీపంలో మద్యంలో పురుగులమందు కలుపుకొని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గోపి ఆత్మహత్యకు ఆర్థిక సమస్యలే కారణమని పోలీసులు భావిస్తున్నారు.
అన్నవరం యూనియన్ బ్యాంకులో.. భారీ అగ్నిప్రమాదం అన్నవరం యూనియన్ బ్యాంక్‌లో భారీ అగ్ని ప్రమాదం: తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలోని యూనియన్ బ్యాంకులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్దఎత్తున సంభవించిన మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిప్రమాదం సమయంలో బ్యాంకులోని పరికరాలు, సామగ్రి దగ్ధం అయ్యాయని సమాచారం. నగదు, పత్రాలు భద్రపరిచే లాకర్ సురక్షితంగా ఉన్నట్లు సమాచారం, దానిపై మరికొద్ది సమయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఉదయం 8.30 గంటల సమయంలో బ్యాంకులో మంటలు చూసి అధికారులకు స్థానికులు సమాచారమందించారు.
జాతీయరహదారిపై విద్యుదాఘతంతో లారీ క్లీనర్ మృతి:ప్రకాశం జిల్లా అద్దంకి మండలం చిన్న కొత్తపల్లి సమీపంలోని జాతీయరహదారిపై విద్యుదాఘతంతో లారీ క్లీనర్ మృతి చెందాడు. మృతుడు యువరాజి (36) తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. లారీ శ్రీశైలం నుంచి మిర్యాలగూడ వైపు వెళ్తుండగా అర్ధరాత్రి సమయం కావడంతో రహదారి పక్కన ఆపే క్రమంలో విద్యుత్ వైర్లు తగిలి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా మృతదేహాన్ని అద్దంకి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
పంచలింగాల చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు.. రూ.1.25 కోట్ల సొమ్ము స్వాధీనం :కర్నూలు జిల్లా పంచలింగాల చెక్‌పోస్టు వద్ద ఎస్‌ఈబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో రూ.1.25 కోట్ల సొమ్మును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి రాజంపేటకు వెళ్తున్న ప్రైవేటు బస్సులో తనిఖీలు చేయగా, రాజమహేంద్రవరానికి చెందిన ఉదయ్ కుమార్ వద్ద నగదును గుర్తించారు. ఆధారాలు లేకుండా నగదు తరలిస్తున్నాడని అధికారులు విచారణ జరుపుతున్నారు.
అహోబిలంలో స్వామి దర్శనానికి వెళ్లిన దంపతుల అదృశ్యం :కర్నూలు జిల్లా అహోబిలంలో స్వామి దర్శనానికి వెళ్లిన కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన దంపతులు నిన్న రాత్రి అదృశ్యమయ్యారు. దంపతుల అదృశ్యంపై ఆళ్లగడ్డ గ్రామీణ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
పొదిలిలో విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి :ప్రకాశం జిల్లా పొదిలి మండలం విశ్వనాధపురంలో విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందాడు. నిర్మాణంలోని గదులకు నీళ్లు తడుపుతూ విద్యుదాఘాతంతో లక్ష్మయ్య(45) మరణించాడు.
శ్రీకాకుళం జిల్లాలో తండ్రిని కత్తితో నరికిన కొడుకు:శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం భావనపాడులో దారుణం జరిగింది. తండ్రి నారాయణరావును కుమారుడు పోలయ్య కత్తితో దారుణంగా నరికాడు. నారాయణరావుకు తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. తండ్రిపై దాడికి కుటుంబకలహాలే కారణమని బంధువులు అంటున్నారు.
లారీ ఢీకొనడంతో ధ్వంసమైన ఎన్టీఆర్ విగ్రహం:కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో లారీ ఢీకొనడంతో గుడ్లవల్లేరులోని ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసమైంది. ధ్వంసమైన ఎన్టీఆర్ విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు తెదేపా నేతలతో కలిసి పరిశీలించారు. విగ్రహ ధ్వంసానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధ్వంసమైన ప్రాంతంలోనే ఎన్టీఆర్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామని తెదేపా నాయకులు స్పష్టం చేశారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను మచిలీపట్నంలో అరెస్టుచేసినట్లు సీఐ వెంకట నారాయణ తెలిపారు.
నల్లమల అటవీప్రాంతం వద్ద వ్యక్తి మృతి: కర్నూలు జిల్లా నల్లమల అటవీప్రాంతమైన నాగలూటి వద్ద వ్యక్తి మృతి చెందాడు. మృతుడు కర్ణాటకకు చెందిన భక్తుడిగా గుర్తించారు. పాదయాత్రగా వచ్చి అనారోగ్యంతో మృతిచెందినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణాజిల్లాలో లారీ, బైక్ ఢీకొని వ్యక్తి మృతి: కృష్ణాజిల్లాలో లారీ, బైక్ ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందాడు. కంచికచర్ల మండలం గొట్టుముక్కల రహదారిలో ఉదయం సమయంలో లారీని బైక్ ఢీకొన్నది. ఈ ఘటనలో గొట్టుముక్కల గ్రామానికి చెందిన తమ్మిశెట్టి గోపి ప్రాణాలు కోల్పోయాడు.
యర్రగొండపాలెంలోని వ్యాపారి ఆదినారాయణ హత్యకేసులో ఏడుగురు అరెస్ట్:ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఈనెల 16న వ్యాపారి ఆదినారాయణ హత్యకేసుపై ఎస్పీ మల్లికా గార్గ్ మీడియా సమావేశం నిర్వహించారు. అచ్యుత్ ఆదినారాయణ హత్య కేసులో ఏడుగురిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
గత మార్చిలో అదృశ్యమైన స్టీల్ ప్లాంట్ ఉద్యోగిని పట్టుకున్న పోలీసులు:గత మార్చిలో అదృశ్యమైన స్టీల్ ప్లాంట్ ఉద్యోగి శ్రీనివాసరావును పోలీసులు పట్టుకున్నారు. అతడిని అనంతపురం నుంచి విశాఖకు స్టీల్ ప్లాంట్ పోలీసులు తీసుకొచ్చారు. గత మార్చిలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగి విధులకు వెళ్లి అదృశ్యం అయ్యారంటూ పీఎస్‌లో మిస్సింగ్ కేసు నమోదయ్యింది. అదృశ్యం కేసును ఛేదించి శ్రీనివాసరావును పట్టుకుని పోలీసులు తీసుకువచ్చారు. శ్రీనివాసరావు ఎందుకు అదృశ్యం అయ్యారనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: Disha App: ఫోన్‌ను 5 సార్లు ఊపితే చాలు.. 10 నిమిషాల్లో పోలీసులు!