Road Accidents: కర్నూలు జిల్లా కల్లూరు మండలం ఉలిందకొండ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సాయిబాబా ఆలయం సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అనంతపురం వైపు నుంచి కర్నూలుకు వస్తున్న కారు.. ఆగి ఉన్న లారీని వేగంగా ఢీకొట్టటంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను కర్నూలు సర్వజన వైద్యశాలకు తరలించారు. మృతులు అనంతపురం జిల్లాకు చెందినవారిగా ప్రాథమికంగా గుర్తించారు.
బొలేరో, ఆర్టీసీ బస్సు ఢీ.. ఇద్దరు మృతి
కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం దామగట్ల క్రాస్ రోడ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు నుంచి కర్నూలుకు వస్తున్న బొలేరు వాహనం... ఆర్టీసీ బస్సును
ఢీకొనటంతో.. అక్కడికక్కడే ఒకరు మృతి చెందారు. మరొకరు చికిత్స పొందుతూ కర్నూలు సర్వజన వైద్యశాలలో మృతి చెందారు. ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మృతులు
కోసిగి వాసులుగా గుర్తించారు. మిర్చి పంటను గుంటూరులో అమ్ముకుని బొలేరోలో వస్తుండగా ప్రమాదం జరిగింది.
వాగులోకి దూసుకెళ్లిన లారీ..
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని తిరుపతి-అనంతపురం జాతీయ రహదారిలో గల భాకరాపేట కనుమ దారిలో దెయ్యాలకోన వాగులోకి లారీ దూసుకెళ్లింది. పుంగనూరు నుంచి రేణిగుంటకు పాలు ప్యాక్ చేసే కవర్లు లోడుతో వస్తు ఈ ప్రమాదానికి గురైంది. అందులో ప్రయాణిస్తున్న డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న చంద్రగిరి పోలీసులు క్షతగాత్రులను 108లో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి:
Crime News: ఆగిఉన్న లారీని ఢీకొట్టిన బైక్.. ఇద్దరు మృతి