వ్యాపార అవసరాల కోసమే జగన్‌కు అమరావతి గుర్తొస్తుందా అని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్ ప్రశ్నించారు. నూతన రాజధానిలో చేపట్టే పలు అభివృద్ధి ప్రాజెక్టులకు సిమెంట్ అవసరం కనుక సరస్వతి సిమెంట్ సంస్థకు పర్యావరణ అనుమతులివ్వాలని కోరిన జగన్... అధికారంలోకి వచ్చాక రాజధానిని మూడు ముక్కలు చేసేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. 'సరస్వతి సంస్థలో తనకు, తన సతీమణి భారతీరెడ్డికి భాగస్వామ్యం ఉందని ఎన్నికల అఫిడవిట్లో జగన్ పేర్కొన్నారు. దీనికి పర్యావరణ అనుమతులు పనురుద్ధరించాలని 2019 ఫిబ్రవరి 19న దరఖాస్తు చేశారు. అంటే మీ సంస్థ కోసం రాజధానిని గొప్పగా పొగిడారా?' అని మండిపడ్డారు.
'సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ నిబంధనల్లో మొదట సిమెంట్ కర్మాగార ప్రస్తావన లేదు. 2008 జులై 15న బోర్డు సమావేశంలో సిమెంట్ పరిశ్రమ నిర్వహణకు వీలుగా సవరణలు చేశారు. కానీ 2008 జూన్ 12న గనుల శాఖ మెమో ఆధారంగా సరస్వతీ ఇండస్ట్రీస్‌కు 613.70హెక్టార్ల గనులు కేటాయించినట్లు 2009 మే 18న ప్రభుత్వం పేర్కొంది. అంటే తండ్రి సీఎంగా ఉన్న సమయంలో కంపెనీ నిబంధనలను సవరించక ముందే భూ కేటాయింపుల మెమోను నడిపించేశారు.