అది నిత్యం రద్దీగా ఉండే మార్గం. వేలాది వాహనాలు రాకపోకలు సాగించే రహదారి. ప్రజాప్రతినిధులు, కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు, అధికారులు కలెక్టరేట్ కు వచ్చివెళ్లే దారి. కర్నూలు నుంచి నంద్యాల, కడప, తిరుపతి, చిత్తూరు, శ్రీశైలం, గుంటూరు, విజయవాడకు వెళ్లే ప్రధాన రహదారి. పెద్దాసుపత్రికి వెళ్లాలన్నా... గాయిత్రీ ఎస్టేట్ లోని ప్రయివేటు ఆసుపత్రులకు వెళ్లాలన్నా ఇదే మార్గంలో రోగులు రాకపోకలు సాగించాలి. ఇంతటి రద్దీ ఉన్న సెంట్రల్ ప్లాజ్ మార్గంలో రహదారులు బాగా దెబ్బతిన్నాయి. రాకపోకలు సాగించటం ప్రయాణికులకు నరకప్రాయమవుతోంది. గతుకుల రోడ్డులో ప్రయాణమంటేనే సాధారణ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.
భారీ వర్షాలతో...
ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాలకు రహదారులు బాగా దెబ్బతిన్నాయి. కంకర తేలింది. వాహనాల రాకపోకల కారణంగా... దుమ్మూధూళితో చాలామందికి శ్వాసకోస సమస్యలు తలెత్తుతున్నాయి. నడుమునొప్పులు తప్పటం లేదు. ఒక్కసారి ఈ మార్గంలో వస్తే... రెండోసారి రావటానికి భయపడుతున్న దయనీయ స్థితి. కనీసం ఇప్పటికైనా వర్షాలకు దెబ్బతిన్న రహదారులను పూర్తి చేయాలని నగర వాసులు కోరుతున్నారు.