Purified drinking water wastage : కర్నూలు జిల్లా డోన్‌లో పైపులు దెబ్బతినడంతో 8 నెలలుగా శుద్ధి చేసిన తాగునీరు వృథాగా పోతోంది. ఇన్ని రోజుల నుంచి నీరు వృథా అవుతున్నా.. మున్సిపల్ సిబ్బంది ఎవరికీ చీమ కుట్టినట్టు కూడా లేదు. ఓ వైపు గుక్కెడు నీటి కోసం అల్లాడుతుంటే.. లీకేజీని ఇంతవరకు అరికట్టకపోవడం ఏంటని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
డోన్ పట్టణ ప్రజలకు గాజులదిన్నె జలాశయం నుంచి నీటిని అందిస్తారు. పట్టణానికి సమీపంలోని పేరంటాలమ్మ గుడి వద్ద ఉన్న పంప్ హౌస్‌కు నీటిని తరలించి, అక్కడ శుద్ధిచేసి, ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేస్తారు. పట్టణానికి మంచినీటిని సరఫరా చేసే పైపులైన్ కంబాలపాడు జాతీయ రహదారి కింద నుంచి వేశారు. అండర్ పాస్ వంతెన నిర్మాణంలో భాగంగా ఎనిమిది నెలల కిందట ఈ రహదారిని తవ్వారు. అప్పుడు ఈ పైప్ లైన్ దెబ్బతినడంతో లీకేజీ ద్వారా భారీగా నీరు వృథా అవుతోంది. ఒక లీటర్ నీటిని శుద్ధి చేసేందుకు మూడు రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు. ఈ లెక్కన 8నెలలు నుంచి ఎంత ప్రజాధనం వృథాగా పోతోందోనని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
"నీళ్లుపారి ఈ ప్రాంతమంతా చిన్న చెరువులా తయారయ్యింది. దాంతో జంతువులు పడి చనిపోతున్నాయి.దుర్వాసన,దోమలు,పందుల బెడద ఎక్కువైపోయింది. వాటి ద్వారా పిల్లలకు,పెద్దలకు జ్వరాలు,రోగాలు వస్తున్నాయి. ఈ నీళ్లు రాకుండా చేసి, రహదారులను బాగుచేయాలని కోరుతున్నాం."-రాంబాబుపొలం యజమాని
"రోడ్డు అవతలి వైపు పైపు పగిలిపోవడంతో నీళ్లన్నీ ఇక్కడ వచ్చి చెరువులాగా మారిపోయింది. ఇళ్లలోకి నీళ్లు వచ్చి నిమ్ము పట్టి పాడైపోతున్నాయి. బాగుచేయమంటే డబ్బులు ఖర్చు అవుతాయి అంటున్నారు. ఈ నీటి వల్ల రోగాలు వస్తున్నాయి."-రాధ, ఆర్. టి. సి కాలనీ.
ఇదీ చదవండి :Flexi Conflict: పార్కులో మద్యం ఫ్లెక్సీ.. విస్తుపోతున్న సందర్శకులు