ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వ్యవసాయ చట్టాల రద్దుకు అలుపెరుగని పోరాటం.. - పశ్చిమగోదావరి రైతుల వార్తలు

వ్యవసాయ చట్టాలు రద్దు కోసం దిల్లీలో రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. వారికి సంఘీభావంగా రాష్ట్రంలోని రైతు సంఘాలు, వామపక్ష నేతలు నిరసనలు తెలుపుతున్నారు. కర్నూలు, పశ్చిమగోదావరి, విశాఖ జిల్లాల్లో రైతులకు మద్దతుగా ఆందోళనలు కొనసాగాయి. కేంద్రం ప్రవేశ పెట్టిన నల్లచట్టాలను రద్దు చేసే వరకు ధర్నాలు, ర్యాలీలు చేపడతామని నాయకులు స్పష్టం చేశారు. విశాఖ జిల్లాలో బొమ్మలతో చేసిన వినూత్న నిరసన అందరిని ఆకట్టుకుంది.

protests-against-agricultural-laws
అలుపెరుగని నిరసనలు

By

Published : Jan 7, 2021, 7:44 PM IST

అలుపెరుగని నిరసనలు

దిల్లీ దీక్ష చేస్తున్న రైతులకు మద్దతుగా కర్నూలులో సీపీఎం నేతల నిరసనలు కొనసాగుతున్నాయి. నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక కలెక్టరేట్ ముట్టడించారు. నల్ల చట్టాలతో పాటు విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని నినాదాలు చేశారు. కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అరెస్టు చేశారు.

నంద్యాలలో..

కర్నూలు జిల్లా నంద్యాలలో సీఐటీయూ నాయకులు జైల్ భరో కార్యక్రమాన్ని నిర్వహించారు. దాంట్లో భాగంగా నల్లచట్టాలకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. నూనెపల్లె రహదారిపై ఆందోళన చేశారు. రోజుల తరబడి రైతులు దీక్ష చేస్తున్నా కేంద్రం స్పందించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. నిరసనకారులను మూడో పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ..

వ్యవసాయ చట్టాల రద్దుపై కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో వామపక్ష నాయకులు రైతు గర్జనను నిర్వహించారు. భారీ బహిరంగ సభ అనంతరం జంగారెడ్డిగూడెం పట్టణంలో వాహనాల ప్రదర్శన చేపట్టారు. దిల్లీ రైతులకు మద్దతు తెలిపారు.

దేశ రాజధానిలో.. గడ్డ కట్టే చలిని సైతం లెక్కచేయకుండా 42రోజులుగా రైతులు పోరాటం చేస్తుంటే ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్లుగా కూడా లేదని కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జెట్టి గురునాధరావు అన్నారు. రైతాంగాన్ని కార్పొరేట్ చేతుల్లో పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారని, వ్యవసాయాన్ని కుదేలు చేసేందుకే కేంద్రం కంకణం కట్టుకుందని విమర్శించారు. కృత్రిమ ఆహార కొరత సృష్టిస్తూ అన్నదాతలను రోడ్డున పడేస్తున్నారని మండిపడ్డారు. వ్యవసాయంలో విద్యుత్తు మీటర్లు బిగించడం రైతాంగానికి గొడ్డలి పెట్టు అని, చిన్న, సన్నకారు అన్నదాతలు నష్టపోతారని వివరించారు. అడ్డగోలుగా జీఓలు చేస్తూ రైతన్నలను కార్పొరేట్ సంస్థల ముందు కాపాలదారుడిగా చేసే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాటం ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు.

విశాఖలో నిరసన ర్యాలీ - అరెస్టులు

విశాఖలో రైతు వ్యతిరేక చట్టాలపై సీఐటీయూ చేపట్టిన నిరసన ర్యాలీ అరెస్టులకు దారితీసింది. నగరంలోని సరస్వతీ పార్కు కూడలి నుంచి ర్యాలీగా వచ్చిన సీఐటీయూ కార్యకర్తలు కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఐటీయూ అఖిల భారత అధ్యక్షురాలు హేమలత, రాష్ట్ర అధ్యక్షుడు నర్సింగరావు, ఇతర కార్మిక నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. నల్లచట్టాలపై స్పందిచకపోతే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.

వినూత్న నిరసన..

ఈ ర్యాలీలో ఏర్పాటు చేసిన బొమ్మలు అందరిని ఆకట్టుకున్నాయి. బలవన్మరణాలకు పాల్పడిన రైతుల తలలు వేసుకున్న రాక్షసుడి బొమ్మను రూపొందించారు. అమరులైన రైతన్నలకు జోహార్లు అంటూ.. నాగలి పట్టుకున్న చేయి గుర్తు బొమ్మ ప్రదర్శనలో ఉంచారు.

అనకాపల్లిలో..

విశాఖ జిల్లా అనకాపల్లిలో నల్ల చట్టాల్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్షాలు, రైతు, కార్మిక సంఘాల సభ్యులు ఆర్డీఓ కార్యాలయాన్ని మూసివేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు తొత్తుగా వ్యవహరిస్తోందని, రైతాంగానికి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. అనకాపల్లి పట్టణ పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి: 'లారీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details