కరోనా వైరస్ పెరుగుతున్న దృష్ట్యా లాక్‌డౌన్ ముమ్మరంగా సాగుతోంది. దీనిని విజయవంతం చేయడానికి కర్త, కర్మ, క్రియ అంతా పోలీసుల ఆధ్వర్యంలోనే నడుస్తోంది. కరోనా వైరస్ అందరికీ ఒకటే అయినా.. తమ ప్రాణాలను పణంగా పెట్టి రాత్రింబవళ్లు, ఆహార పానీయాలు లేకుండా మండే ఎండలో పని చేసుకుంటూ పోలీసులు నలిగిపోతున్నారు . అంటువాంటివే నంద్యాల పట్టణంలో కనిపించిన కొన్ని దృశ్యాలు మీకోసం.
దాతలు ఇచ్చే ఆహార పొట్లాలను తీసుకుంటున్న పోలీసులు
అసలే ఎండాకాలం.. ఎండలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్నారు. రాత్రింబవళ్లు రోడ్లపైనే ఉంటున్నారు. తెల్లవారుజాము నుంచి రాత్రి పొద్దుపోయే వరకు విధుల్లో మునిగిపోతున్నారు. సరైన ఆహారం లేక, నీళ్లు తీసుకోకుండా, నిద్రకు, కుటుంబాలకు దూరంగా విధుల్లో నిమగ్నమయ్యారు. జిల్లా వ్యాప్తంగా కానిస్టేబుల్ నుంచి డీఐజీ స్థాయి అధికారి వరకు అందరిదీ ఇదే పరిస్థితి.
వారం రోజులుగా రోడ్లపైనే..
ఈ నెల 22న జనతా కర్ఫ్యూ ప్రారంభమైన దగ్గరి నుంచి ఇప్పటి వరకు పోలీసులు తమ విధుల్లో భాగంగా నిర్వహించే సాధారణ విధులకంటే అసాధారణ విధులను నిర్వహిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి రోడ్ల పైకి వస్తున్న పోలీసులు, హోంగార్డులు రాత్రి 9 గంటల తర్వాతే ఇళ్లకు చేరుకుంటున్నారు. ఉదయం అల్పాహారం నుంచి ఆహారం, నీళ్లు అన్నీ రోడ్ల మీదే తీసుకుంటున్నారు. సాధారణంగా పోలీసులకు ఉండే అలర్జీ, గ్యాస్‌ట్రబుల్, మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులను కూడా లెక్క చేయడం లేదు. ఇప్పటికే సిబ్బంది కొరతతో ఇబ్బందులు పడుతున్న పోలీసు శాఖ ఉన్నంతలోనే సమర్థంగా విధులు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. కుటుంబాలకు దూరంగా విధులు నిర్వహిస్తూ ఒక రకంగా ఒత్తిడికి గురవుతున్నారని చెప్పక తప్పదు.
కనీస జాగ్రత్తలు కరవై...
కరోనా నేపథ్యంలో సామాన్యుడు సైతం ముఖానికి మాస్కు, చేతులకు గ్లౌజ్‌లు వేసుకుని బయటకు వస్తున్న దశలో.. పోలీసులకు ముఖానికి, చేతులకు కనీస తొడుగులు కూడా సరఫరా లేదు. దీంతో చేతిరుమాల్లనే ముఖానికి అడ్డు పెట్టుకుని విధులు చాలా మంది నిర్వహిస్తున్నారు. చేతులను శుభ్రం చేసుకునేందుకువాడే శానిటైజర్లను కూడా రెండు రోజుల క్రితమే వారికి అందించారు. మండే ఎండల్లో ఉంటున్న ప్రత్యేకంగా నీళ్లు ఇచ్చేవారు కూడా కరవయ్యారు. దాతలు అనాథలు, నిరాశ్రయులకు ఇచ్చే ఆహారం, నీళ్లనే వీరికి అందిస్తున్నారు. కొన్నిచోట్ల విధులు నిర్వహిస్తున్న పోలీసులకు మధ్యాహ్నం వేళ నీడకు పోదామంటే కూడా చిన్నపాటి దాపు లేకుండా పోయింది.