ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Police Attacks on Public: పోలీసుల ప్రతాపం..."బాధితులపైనే” ...

By

Published : Mar 19, 2022, 5:25 PM IST

Police Attacks on Public: సాధారణంగా పోలీస్‌స్టేషన్‌ గడప తొక్కాలని సామాన్యులెవరూ కోరుకోరు. ఏదైనా అన్యాయం జరిగినప్పుడు మాత్రమే పోలీసుల్ని ఆశ్రయిస్తారు. న్యాయం జరగాలని ఆశిస్తారు. అన్యాయం చేసినవారిని శిక్షించాలని కోరుకుంటారు. కానీ..రాష్ట్రంలో మాత్రం ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. బాధితులు, అనామకులు, అమాయకులే శిక్షలకు గురౌతున్నారు. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల జరుగిన కొన్ని అమానవీయ ఘటనలు ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి.

Kurnool Police Attacks on Victims
Kurnool Police Attacks on Victims

పోలీసుల ప్రతాపం..."బాధితులపైనే” ...

Kurnool Police Attacks on Victims: కర్నూలు జిల్లాలో పోలీసుల వ్యవహారశైలి తీవ్ర విమర్శలకు తావిస్తోంది. న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌ గడప తొక్కిన బాధితులనే తీవ్రంగా కొట్టడం, అమాయకులపై ప్రతాపం చూపించడం, పరుష పదజాలంతో దూషించడం వంటి వరుస ఘటనలు విస్తుపోయేలా చేస్తున్నాయి. పోలీసు జులుంపై ఎవరికి చెప్పుకోవాలో తెలియక బాధితులు, సామాన్యులు తీవ్రంగా మథనపడుతున్నారు.

కళ్లు నెత్తికెక్కాయా..? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా..? ముందు జీపెక్కు, వివరాలన్నీ స్టేషన్‌లో చెబుతా..! ఏదైనా సినిమాలో ప్రతినాయక ఛాయలున్న పోలీసుల డైలాగులు కాదివి. సాటి మనుషులనే విచక్షణ లేకుండా.. సామాన్యుల పట్ల కొందరు పోలీసులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్న తీరిది. కర్నూలు జిల్లా కొత్తపల్లి ఎస్సై ముబీన్‌ తాజ్‌... సాటి మహిళ అనే మర్యాద లేకుండా ఓ అంగన్‌వాడీకి చేసిన హెచ్చరికలివి.

కొత్తపల్లి మండలం సింగరాజుపల్లికి చెందిన అంగన్‌వాడీ హరిత.. తండ్రితో కలిసి పొలంలో పని చేసుకుంటుండగా ఎస్సై ముబీన్‌ తాజ్‌తో పాటు కానిస్టేబుళ్లు అక్కడికి వె‌ళ్లారు. ఇక్కడికి వచ్చారేంటి మేడం..? అని అడిగిన హరితను.. ఎస్సై అనరాని మాటలు అన్నారు. బలవంతంగా లాక్కెళ్లి పోలీస్‌స్టేషన్‌లో 4 గంటలు కూర్చోబెట్టారు. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వకుండా వేధించారని హరిత వాపోయారు. చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్లడం లేదని చెప్పినా వినిపించుకోకుండా అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక ఓ కేసులో తమవారికి న్యాయం చేయాలంటూ ఈ నెల 12న పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన ముగ్గురు యువకులను.. ఆస్పరి ఎస్సై ముని ప్రతాప్‌ చితకబాదారు. అర్ధరాత్రి ఇళ్లకు వచ్చి మరీ దాడి చేసినట్లు బాధితులు వాపోయారు. ఈ చర్యతో భయపడి పత్తికొండకు పారిపోయిన యువకులను గాలించి పట్టుకున్న పోలీసులు.. మళ్లీ చితకబాది నాన్‌ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. బాధితులు విరూపాక్షి, రమేష్‌, రాజశేఖర్‌... తమపై జరిగిన దాడిని ఆదోని కోర్టులో పూసగుచ్చినట్లు వివరించారు. రక్షణ కల్పించాలని న్యాయమూర్తిని వేడుకున్నారు. దెబ్బలను చూసి చలించిపోయిన జడ్జి.. బాధితులకు చికిత్స అందించాలని ఆదేశించారు.

"ప్రభుత్వం కానీ, డీఐజీ కానీ ఏం చెప్తున్నారో తెలియడం లేదు కానీ.. కింది స్థాయిలో పోలీసులు మహిళలని కూడా చూడకుండా దుర్భాషలాడుతున్నారు. మగ పోలీసులు ఆడవారితో కలిసి ఫొటోలు దిగి వారి వారి సీఐలకు పంపడం చాలా దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తున్నాం. పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారు. పోలీసు శాఖ సామాన్యుల పట్ల చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తోంది. కొట్టడం, తిట్టడం, దుర్భాషలాడటం వారి హక్కా ? వీటిపై మేము కోర్టుకు కూడా వెళ్తాం. మానవ హక్కుల కమిషన్​కు కూడా వెళ్తాం. కొత్తపల్లి, ఆస్పరి ఎస్సైలను సస్పెండ్ చేయాల్సిన బాధ్యత ఎస్పీపై ఉంది. ఈ విషయాన్ని మేము వదిలిపెట్టం. " -నిర్మలమ్మ, సీఐటీయూ నాయకురాలు.

ఇదీ చదవండి :నూజివీడులో ఉద్రిక్తత.. వైకాపా, తెదేపా నేతల సవాళ్లు..!

Kurnool Police Attacks on Public: ఆళ్లగడ్డ బాలికల ఉన్నత పాఠశాల బయట ఆకతాయిల అల్లరిపై ఫిర్యాదు అందడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇది గమనించిన ఆకతాయిలు... సమీపంలోని బాలుర వసతి గృహంలోకి వెళ్లి అక్కడి నుంచి పారిపోయారు. వసతిగృహంలోకి వెళ్లిన ఎస్సై.. తమకు సంబంధం లేదని చెబుతున్నా వినకుండా వాచ్‌మన్‌ సహా మిగిలిన విద్యార్థులను చితగ్గొట్టారు. బాధితులు ఎస్పీని ఆశ్రయించగా.. ఎస్సైని బదిలీ చేశారు. అలాగే తన ఇంటికి సరఫరా ఆపేశారంటూ విద్యుత్ ఉద్యోగిని ఎస్సై విచక్షణారహితంగా కొట్టారు. దుస్తులు విప్పించి పోలీస్‌స్టేషన్‌లో కూర్చోబెట్టారు. వెల్దుర్తిలో పనిచేసిన ఎస్సై ఓ వ్యక్తిని చితకబాదగా.. పెద్దలు రాజీ కుదిర్చారు. కోడుమూరులో రోడ్డుపై నిల్చున్న ఓ యువకుడిని స్టేషన్‌కు రమ్మని పిలవగా ఎందుకని ప్రశ్నించినందుకు.. చెయ్యి విరగ్గొట్టారు. నంద్యాలలో న్యాయం చేయాలని వెళ్లిన ఓ రైతును.. గంజాయి కేసు పెట్టి ఇరికిస్తానని ఎస్సై బెదిరించారు. దీనిపై బాధితుడు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

" పట్టుకుని వెళ్లి.. ఇష్టానుసారం కొట్టే హక్కు పోలీసులకు ఎవరిచ్చారు. ఎన్ని రోజులను అరెస్టులు చేస్తారు. ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలను అమలు చేస్తే మేము రోడ్ల మీదకు ఎందుకు వస్తాం. వరుసగా ఇలాంటి సంఘటను పెరుగుతున్నా జిల్లా పోలీసు అధికారులు,ఎస్పీ చిరునవ్వులు నవ్వడం కాదు. వాళ్లని అదుపు చేయడం మీ బాధ్యత. అలా అదుపు చేయకపోతే మీరే ఉద్యమాలను అణచి వేయడం కోసం ఇలా చేయిస్తున్నారని భావిస్తాం. మానవ హక్కుల కమిషన్ కచ్చితంగా ఈ విషయంపై స్పందిస్తుంది. లాఠీ ఉంది కదాని ఝుళిపిస్తే..ప్రజలు తిరగబడతారు. ఇప్పటికైనా ఈ దాడులు ఆపకపోతే వామ పక్షాలు తరుపున ప్రజల రక్షణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వానికి తెలుపుతున్నాం." - గౌస్ దేశాయ్, సీపీఎం కర్నూలు జిల్లా కార్యదర్శి.

పైకి ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పుకొంటున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి విరుద్ధంగా ఉందని ప్రజాసంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి వచ్చినప్పటి నుంచి ఇలాంటి ఘటనలు ఎక్కువయ్యాయని.. నిందితులపై ఫిర్యాదు చేస్తున్నా స్పందన రాకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు.

ఇదీ చదవండి :"నాటు సారాను అరికట్టండి.. తయారీదారులపై చర్యలు తీసుకోండి"

ABOUT THE AUTHOR

...view details