అనివార్య కారణాలతో నిలిచిపోయిన పరిషత్ ఎన్నికలకు(parishath elections) ఈరోజు పోలింగ్ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 10 జడ్పీటీసీ(ZPTC), 123 ఎంపీటీసీ(MPTC) స్థానాలకు ఉ.7 గంటలకు పోలింగ్ ప్రారంభమై.. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. గురువారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
కర్నూలు..
అనివార్య కారణాలతో నిలిచిపోయిన పరిషత్ ఎన్నికల(parishath elections)కు కర్నూలు జిల్లా(kurnool district)లో.. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. నంద్యాల మండలంలో జడ్పీటీసీ, ఆదోని మండలంలో ఎంపీటీసీ ఎన్నికల్లో .. పోలింగ్ కేంద్రాలకు ప్రజలు బారులు తీరుతున్నారు. గ్రామాల్లో ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.
అనంతపురం..
అనంతపురం జిల్లా(anantapur district) చిలమత్తూరు మండలం జడ్పీటీసీ స్థానానికి, పెద్దపప్పూరు మండలం జుటూరు, పెద్దవడుగురు మండలం గుత్తి అనంతపురం ఎంపీటీసీ స్థానాలకు ఎన్నిక జరుగుతోంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరారు. మురడి పోలింగ్ కేంద్రంలో ఇప్పటివరకు 29 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
కడప..
కడప జిల్లా(kadapa district) జమ్మలమడుగు మండలం గొరిగనూరు ఎంపీటీసీ స్థానానికి పోలింగ్ కొనసాగుతోంది. సెప్టెంబర్ 19న ఎన్నికల లెక్కింపులో గొరిగనూరు ఎంపీటీసీ స్థానం పరిధిలోని ధర్మాపురం, శేషారెడ్డి పల్లె గ్రామాల్లోని బ్యాలెట్ పత్రాలు తడిసిపోయాయి. దీంతో మళ్లీ ఎన్నిక నిర్వహిస్తున్నారు.
కృష్ణా..
కృష్ణా జిల్లా(krishna district)లోని నూజివీడు మండలంలోని దేవరగుంటా, ఆగిరిపల్లి మండలంలోని ఈధర గ్రామాల్లో ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. జి.కొండూరు మండలంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాలను నూజివీడు సబ్ డివిజన్ డీఎస్పీ బి.శ్రీనివాసులు పరిశీలిస్తున్నారు. పెడన జడ్పీటీసీ స్థానానికి ఉదయం 9 గంటల వరకు 25 శాతం పోలింగ్ నమోదైంది. నాగాయలంక మండలం పర్రచివర ఎంపీటీసీ స్థానానికి ఎన్నిక జరుగుతోంది. ఉదయం 9 గంటల వరకు 15 శాతం పోలింగ్ నమోదైంది.