కరోనా కారణంతో గ్రామాల నుంచి వలసలు ఆగిపోయాయి. ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు పల్లెలకు చేరుకున్నారు. గ్రామాలకు తిరిగి వచ్చిన వారంతా వ్యవసాయంపై దృష్టిసారించారు. దీంతో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది ఉల్లి సాగు విస్తీర్ణం పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. కర్నూలు జిల్లాలో 45 వేల ఎకరాల్లో ఉల్లి పంట వేశారు. దిగుబడులు ఎక్కువ వస్తాయని రైతులు ఆశించిన తరుణంలో భారీ వర్షాలు, వరదలు పంటలపై తీవ్ర ప్రభావం చూపాయి. చేతికొచ్చిన పంటను నీట ముంచాయి. దిగుబడులు సగానికి పైగా తగ్గిపోయాయి.
ఉల్లిపంట సాగుకు ఎకరానికి సుమారు రూ.50 వేల నుంచి రూ.70 వేలు పెట్టుబడి అవుతుందని రైతులు చెప్పారు. మంచి దిగుబడులు వస్తే... ఎకరానికి సుమారు వంద క్వింటాళ్ల పంట వస్తుందన్నారు. వర్షాల కారణంగా ఎకరానికి 50 క్వింటాళ్లు కూడా రావటంలేదని రైతులు తెలిపారు. దీనికి తోడు కూలీల కొరత ఎక్కువగా ఉందని అంటున్నారు. రవాణా ఖర్చులు రెట్టింపయ్యాయన్నారు. ఈ పరిస్థితుల్లో ధరలు ఆశాజనంగా ఉన్నా... తగ్గిన దిగుబడులు, పెరిగిన ఖర్చులతో రైతన్నలు కుదేలవుతున్నారు. వానల వల్ల తీవ్రంగా నష్టపోయామని రైతన్నలు వాపోతున్నారు.