నంద్యాల జిల్లా వెలుగోడు మండల పరిధిలో విషాదం చోటుచేసుకుంది. వివాహమై కొన్ని గంటలు గడవకముందే నవవరుడు శివకుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. నంద్యాల జిల్లాలోని వెలుగోడు మండలం బోయరేవుల గ్రామానికి చెందిన శివకుమార్‌కు జూపాడుబంగ్లా మండలంలోని భాస్కరాపురం గ్రామానికి చెందిన యువతితో శుక్రవారం వివాహం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున 3 గంటల సమయంలో వాకింగ్‌కు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లాడని కుటుంబసభ్యులు తెలిపారు.
వివాహమైన గంటల వ్యవధిలోనే వరుడు మృతి - నంద్యాలలో నవవరుడు మృతి
నంద్యాల జిల్లా వెలుగోడు మండల పరిధిలో విషాదం చోటుచేసుకుంది. ఓ యువకుడు వివాహమైన కొన్ని గంటలకే అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మార్నింగ్ వాక్ కోసం వెళ్లిన అతను రోడ్డుపై పడి ఉన్నాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ఎంతసేపటికీ తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు శివకుమార్ కోసం వెతకడం ప్రారంభించారు. బోయరేవుల - మోత్కూరు గ్రామాల మధ్య రోడ్డుపై శివకుమార్ పడి ఉండడాన్ని కుటుంబసభ్యులు గుర్తించారు. చలనం లేకుండా రోడ్డుపై పడిఉన్న ఉన్న అతడిని హుటాహుటిన ఆత్మకూరు ఆస్పత్రికి తరలించారు. శివకుమార్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందా? లేక ఎవరైనా హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివాహం జరిగిన గంటల వ్యవధిలోనే నవవరుడు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
ఇదీ చదవండి: