Mantralaya Raghavendra Swamy Mutt: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయానికి రాష్ట్రం నుంచే కాకుండా.. కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. పెరుగుతున్న భక్తులకు సౌకర్యం కోసం, వసతి సౌకర్యాలు పెంచేందుకు రాఘవేంద్రస్వామి మఠం చర్యలు చేపట్టింది. భక్తులను భాగస్వాములుగా చేస్తూ.. రూ.25.5 కోట్ల రూపాయల విరాళాలు సేకరించింది. ఈ క్షేత్రం ఇప్పుడు నూతన సొబగులను అద్దుకుంటోంది. ఇరుకుగా ఉన్న ఆలయ ప్రాంగణంలో పాత కట్టడాలు కూల్చివేసి వాటి స్థానంలో నూతన నిర్మాణాలు చేపట్టారు. భక్తుల సౌకర్యం కోసం మరిన్ని విడిది కేంద్రాలు సిద్ధమవుతున్నాయి.
రాఘవేంద్రస్వామి మఠం నుంచి మహా ముఖద్వారం వరకు.. కారిడార్ నిర్మాణ పనులు చేపట్టారు. గతంలో ఉన్న ముఖద్వారాన్ని పూర్తిగా మార్చి విశాలంగా నిర్మిస్తున్నారు. ముఖద్వారం నుంచి లోపలికి ప్రవేశించగానే.. ఓ ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలా శిల్పాలతో తీర్చిదిద్దుతున్నారు. పురాణాల్లోని ప్రముఖ ఘట్టాలను తెలియజేసేలా విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. అందమైన విద్యుత్ దీపాలంకరణ, ఫౌంటెన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి :ఇక్కడకొచ్చిన వారికి పుణ్యం పురుషార్థం దక్కాలనే: త్రిదండి చినజీయర్ స్వామి
Mantralaya Raghavendra Swamy Temple : సాధారణ భక్తులతోపాటు, ప్రముఖుల కోసం ప్రత్యేక విశ్రాంత మందిరాలు నిర్మిస్తున్నారు. గతంలో ఉన్న పద్మనాభ, నరహరి డార్మిటరీల స్థానంలో 3 కోట్ల రూపాయలతో.. 20 వీఐపీ సూట్లు నిర్మిస్తున్నారు. ప్రముఖుల విడిది కోసమే వీటిని అందుబాటులోకి తెస్తున్నారు. సీఆర్వో కార్యాలయం వెనుకభాగంలో 6 కోట్ల రూపాయలతో మరో వంద గదులు అందుబాటులోకి తేనున్నారు. ఇవి సాధారణ భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్నారు. 6 కోట్ల రూపాయలతో థీమ్ పార్కు, మరో 6 కోట్లతో శ్రీరామాలయం నిర్మించనున్నారు. ఈ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని.. పీఠాధిపతి సుబుదేందుతీర్థులు తెలిపారు.