కర్నూలు శివారులోని ఓర్వకల్లు విమానాశ్రయాన్ని దసరా నుంచి అందుబాటులోకి తెస్తామని, రాష్ట్రంలోనే తొలి పైలెట్ శిక్షణా కేంద్రం ఓర్వకల్లులో పెడుతున్నామని ప్రభుత్వం ప్రకటించింది. కర్నూలు నుంచి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓర్వకల్లు ప్రాంతంలో విమానాశ్రయం నిర్మించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. 2017 సెప్టెంబర్లో సుమారు వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో... "గ్రీన్ ఫీల్డ్ నో- ఫ్లిల్స్" ఎయిర్ పోర్టు పనులకు శ్రీకారం చుట్టింది. కేవలం 18 నెలల్లో సుమారు 90 శాతం పనులు పూర్తి చేసి... విమానాశ్రయాన్ని దాదాపు సిద్ధం చేసింది. 2018 డిసెంబర్ 31న ట్రయిల్ రన్ విజయవంతంగా నిర్వహించారు.
ఎన్నికలకు ముందు 2019 జనవరిలో.. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు విమానాశ్రయాన్ని అధికారికంగా ప్రారంభించారు. విమాన సర్వీసుల ప్రారంభానికి ముందే... నాటి సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ, జమ్ము-కశ్మీర్ మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ సహా పలువులు పారిశ్రామికవేత్తలు ఇక్కడి నుంచి సుమారు 40 సార్లు విమాన రాకపోకలు సాగించారు.
పనులు పూర్తి
2019 ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారటం వల్ల విధానపర అనుమతుల వల్ల విమానాశ్రయ పనులు కొంత ఆలస్యం అయ్యాయి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) నుంచి అనుమతులు లేక పనులు ఆలస్యమయ్యాయి. ఏడాది క్రితం వైకాపా ప్రభుత్వం నైట్ ల్యాండింగ్ సిస్టం పనులకు రూ.7 కోట్లు కేటాయించింది. ఈ పనులు దాదాపు పూర్తయ్యాయి. రూ.18 కోట్లతో... అత్యాధునిక ఫైర్ వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. ఎయిర్ ట్రాఫిక్ టవర్, ల్యాండ్ స్కేపింగ్, బీఎస్ఎన్ఎల్ ద్వారా కమ్యూనికేషన్ వ్యవస్థ, ఫైర్ ఎన్ఓసీ, మెడికల్ హెల్త్ సౌకర్యం, ఎయిర్ క్రాఫ్ట్ ఫ్యూయల్, ఏటీఎం సౌకర్యం లాంటి పనులు దాదాపు పూర్తయ్యాయి.