కరోనా పరీక్షల కచ్చితత్వంలో కర్నూలు వీఆర్డీ ల్యాబ్‌కు అవార్డు కరోనా కేసుల్లో రాష్ట్రంలో రెండో స్థానంలో కర్నూలు జిల్లా కొనసాగుతోంది. జిల్లాలో మార్చి 28న మొదటి పాజిటివ్ కేసు నమోదయ్యింది. కేసులు వచ్చిన మొదట్లో శాంపిల్స్ ను పుణె పంపేవారు. ఆ తర్వాత తిరుపతి స్విమ్స్ ల్యాబ్‌కు, అనంతరం అనంతపురంలోని ల్యాబ్ కు పంపాల్సి వచ్చేది. క్రమంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం, కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల... ప్రభుత్వం ఏప్రిల్ నుంచి కర్నూలు మెడికల్ కళాశాలలోని మైక్రోబయాలజీ విభాగంలో వీఆర్డీ ల్యాబ్ ను ఏర్పాటు చేశారు. ఈ ల్యాబ్ ఏర్పాటుతో... కరోనా నిర్ధరణ పరీక్షలు వేగవంతం అయ్యాయి. ప్రస్తుతం రోజుకు సుమారు 3 వేల 500 పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 3 లక్షలకుపైగా ఫలితాలు వెల్లడించారు. ఫలితాల్లో నాణ్యత, అత్యధిక పరీక్షలకు గాను రాష్ట్ర ప్రభుత్వం వీఆర్డీ ల్యాబ్ కు అవార్డును ప్రకటించింది. ఈ అవార్డుల్లో మొదటి స్థానంలో తిరుపతి స్విమ్స్ నిలవగా, రెండో స్థానంలో కర్నూలు వీఆర్డీ ల్యాబ్ కు నిలిచింది.
కరోనా జీనోమ్ స్వీక్వెన్సింగ్
కేవలం నిర్ధరణ పరీక్షలే కాకుండా... కరోనాపై పరిశోధనల్లోనూ మెరుగైన ఫలితాలు సాధిస్తోంది మైక్రోబయాలజీ విభాగం. కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్- సీఎస్‌ఐఆర్ పరిధిలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ- ఐజీఐబీతో సంయుక్తంగా పరిశోధనలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కర్నూలు ప్రాంతం నుంచి 90 మంది కరోనా బాధితుల శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ చేశారు. చైనాలోని ఊహాన్ తో పోల్చితే... కొవిడ్- 19 ఈ ప్రాంతంలో ఏ విధంగా మార్పు చెందుతోంది. దాని వ్యాప్తి ఎలా ఉంది. ఏ విధంగా ఈ వైరస్ హాని చేస్తుంది అనే విషయాలపై పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయాలపై అమెరికాలోని ఓ ప్రముఖ జర్నల్ కు వ్యాసం పంపినట్లు అధికారులు తెలిపారు. దేశంలోని 7 సంస్థలు కరోనాపై పరిశోధనలు చేస్తుంటే... రాష్ట్రం నుంచి కర్నూలు మెడికల్ కళాశాల మాత్రమే ఈ అధ్యయనంలో భాగం అయినట్లు నిపుణులు వివరిస్తున్నారు.
త్వరలో కర్నూలు వైద్య కళాశాలకు ఆర్ఎన్ఏ ఎక్స్ ట్రాక్షన్ మిషన్ రానుందని మైక్రో బయాలజీ హెచ్ఓడీ డా.సురేఖ తెలిపారు. ఈ మిషన్ ద్వారా మరిన్ని టెస్టులు చేయటానికి వీలుంటుందన్నారు. కరోనా పరిశోధనల ద్వారా ఆర్టీపీసీఆర్ కిట్స్ తయారు చేసుకోవటం సహా వ్యాక్సిన్ తయారీకి అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు అభిప్రాయపడతున్నారు.
ఇదీ చదవండి :అంతం కాదిది.. ఆరంభం: రఘురామకృష్ణరాజు