కర్నూలు జిల్లాలో హోటల్ పరిశ్రమ మూడు టిఫిన్లు, ఆరు భోజనాలు అన్నట్లుగా సాగేది. ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక కేంద్రాలు సహా చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, అమరావతికి సమాన దూరంలో జిల్లా ఉండటం వల్ల పర్యాటకులు, యాత్రికులు అధిక సంఖ్యలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు వచ్చేవారు.
జిల్లాలో టిఫిన్ సెంటర్ల నుంచి పెద్ద హోటళ్ల వరకు సుమారు 3700 వరకు ఉన్నాయని అంచనా. కర్నూలు నగరంలో చిన్నా, పెద్ద హోటళ్లు కలిపి మొత్తం 328 వరకు ఉండగా, నంద్యాలలో 200, ఆదోనిలో 120, ఎమ్మిగనూరు 30, డోన్ 30, ఆత్మకూరు 20, ఆళ్లగడ్డ 20, నందికొట్కూరు 15, కోవెలకుంట్ల 10, గూడూరు 10, పత్తికొండ 10, బేతంచర్లలో 10 వరకు ఉన్నాయి. కర్నూలు, నంద్యాలలో త్రిస్టార్ సౌకర్యాలతో హోటళ్లు నడుస్తున్నాయి. ఇవన్నీ లాక్‌డౌన్‌తో మూతపడ్డాయి. జిల్లా వ్యాప్తంగా కనీసం టీ స్టాళ్లు సైతం తెరచుకోని పరిస్థితి ఏర్పడింది.
జిల్లా వ్యాప్తంగా లాక్‌డౌన్‌తో సుమారు 70 కోట్లకు పైగా అతిథ్య రంగం నష్టపోయింది. రోజుకు సగటున కోటి రూపాయల వరకు వ్యాపారం జరిగేదని నిర్వహకులు చెబుతున్నారు. కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీ, శ్రీనివాసనగర్, ఆర్టీసీ బస్టాండు, పెద్దాసుపత్రి, కలెక్టరేట్, కొండారెడ్డి బురుజు, సీ క్యాంప్, నందికొట్కూరు చౌరస్తా, బళ్లారి చౌరస్తాల్లో హోటళ్లు అధికంగా ఉన్నాయి.